Foundation stone for Hyderabad Airport Express Metro : హైదరాబాద్‌లో మరో భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు మైండ్‌స్పేస్ వద్ద ఆయన ఉదయం 10 గంటలకు పునాదిరాయి వేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.
అయిదేళ్ల నాటి సీఎం ఆలోచన ఇది:అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతున్న హైదరాబాద్‌లో విమానాశ్రయం వరకు మెట్రో ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. నగరం నుంచి శరవేగంగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకునేలా ఎక్స్‌ప్రెస్ మెట్రోను మెట్రో రెండో దశలో చేర్చాలని 2018 జనవరిలో అధికారులకు ఆయన సూచించారు. దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ)కి ఎలైన్‌మెంట్, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) తయారీ బాధ్యతలను అప్పగించాలని నిర్దేశించారు. అదే ఏడాది మార్చిలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్(హెచ్‌ఏఎంఎల్) పేరుతో ప్రత్యేక సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 30.7 కి.మీ. మార్గానికి హెచ్‌ఏఎంఎల్‌తో కలిసి డీఎంఆర్‌సీ డీపీఆర్‌ను రూపొందించింది. 2019లోనే ప్రభుత్వానికి దీన్ని సమర్పించారు. నిధుల లేమితో ఇన్నాళ్లు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు సీఎం పచ్చజెండా ఊపడంతో ఇప్పుడు పునాదిరాయి పడుతోంది. శంకుస్థాపన అనంతరం అతి త్వరలో గ్లోబల్ టెండర్లు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. భూ సేకరణ సమస్యలు లేనందువల్ల మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
మార్గమిలా:మైండ్‌స్పేస్ కూడలి నుంచి 0.9 కి.మీ. దూరంలో కొత్తగా నిర్మించే రాయదుర్గం ఎయిర్‌పోర్ట్ స్టేషన్‌తో విమానాశ్రయ మెట్రో ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి బయోడైవర్సిటీ కూడలిలోని రెండు ఫ్లైఓవర్లను దాటుకుని నేరుగా కాజాగూడ చెరువు పక్క నుంచి ఎలైన్‌మెంట్ వెళ్తుంది. కాజాగూడ నుంచి కుడివైపు తిరిగి నానక్‌రాంగూడ కూడలి, అక్కడి నుంచి ఓఆర్‌ఆర్ పక్క నుంచి నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్, విమానాశ్రయ కార్గో మీదుగా విమానాశ్రయంలోకి నేరుగా చేరుకునేలా జీఎంఆర్ సమన్వయంతో ఎలైన్‌మెంట్ రూపొందించారు.
ప్రత్యేకతలివీ...
*విమానాశ్రయ మెట్రోలో ఇప్పుడున్న మెట్రో కంటే మరింత అధునాతన సౌకర్యాలు కల్పిస్తారు.