రాష్ట్ర సర్పంచులు దేశంలోనే తలెత్తుకుని తిరుగుతున్నారని సీఎం కేసీఆర్ శాసనసభ సమావేశాల్లో (KCR in assembly sessions 2021) పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో సగటున రూ.4 గ్రాంటు విడుదల చేశారని గుర్తు చేశారు. తెరాస హయాంలో రూ.650కి పైగా విడుదల చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో సర్పంచులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
మన గ్రామాలను చూసి పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయన్న కేసీఆర్.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో సభ్యులకు తెలియదా? అని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే కేంద్రం నిధులు విడుదల చేస్తోందని ప్రకటించారు. కొన్నిచోట్ల వనరులు ఉంటాయి.. మరికొన్నిచోట్ల వనరులు ఉండవని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భూముల అమ్మకం ద్వారా ఆదాయం సమకూరుతుందని ఉద్ఘాటించారు. అన్ని పంచాయతీలకు సమన్యాయం జరగాలని ఆలోచిస్తున్నామన్నారు.
ఏకగ్రీవమైన గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క శాసనసభలో లేవనెత్తిన అంశంపై కేసీఆర్ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
ఏకగ్రీవ పంచాయతీల నిధులపై భట్టి ప్రశ్నకు కేసీఆర్ సమాధానం
ప్రశ్న: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే... అందులో 1935 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ప్రోత్సాహక నిధులు రూ.193 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయా? పెండింగ్ ఉంటే ఇస్తామని లేదంటే ఇవ్వబోమని చెప్పండి.
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
జవాబు: ఏది చేసినా ధైర్యంగా చేస్తాం.. ఆచరణలో చూపిస్తాం. ఏకగ్రీవ గ్రామాలకు నిధులు ఇస్తామని చెప్పలేదు. నూతన పంచాయతీరాజ్ చట్టంలోనే ఈ అంశం లేదు. కొత్త చట్టం చదివారో లేదో నాకు తెలియదు... దాని ప్రకారమే మేం నిధులు ఇస్తున్నాం.
- సీఎం కేసీఆర్
గత ప్రభుత్వాల హయాలో దివాళా
గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో పంచాయతీలు దివాళా తీశాయని ఆరోపించారు. గత ప్రభుత్వాల హయాంలోని బకాయిలు ఇప్పటికీ ఉన్నాయన్న కేసీఆర్.. నిధులు మళ్లింపు అనేది అవాస్తవమన్నారు. పంచాయతీరాజ్ చట్టంలో భాగంగానే జీవోలు జారీ చేశారని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సభలో చర్చించాలని సూచించారు. ఇంటింటికి తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. స్వయంగా కేంద్రమంత్రే లోక్‌సభలో ప్రస్తావించారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా అద్భుతంగా నీరు వస్తోందని స్పష్టం చేశారు. అవాస్తవాలు చెప్పడానికి ఆస్కారమే లేదని వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.
నిధుల మళ్లింపు ప్రస్తావనే లేదు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో వ్యక్తిపై సగటు ఖర్చు రూ.4. ఇప్పుడు వ్యక్తిపై సగటున రూ.650 ఖర్చు చేస్తున్నాం. గతంలో సర్పంచులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మా హయాంలో సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే కేంద్రం నిధులు. నిధుల దారి మళ్లింపు అనేది పూర్తిస్థాయి సత్యదూరం. సర్పంచులకు అన్ని హక్కులు కల్పించి స్వేచ్ఛ ఇచ్చాం.
- సీఎం కేసీఆర్
పంచాయతీరాజ్ నిధుల మళ్లింపుపై కాంగ్రెస్ సభ్యుల ప్రశ్నకు కేసీఆర్ సమాధానం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై చర్చ జరగాలి
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గత ప్రభుత్వాలు నెరవేర్చలేదన్న కేసీఆర్... తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన చరిత్ర తమదేనని చెప్పారు. ఆర్థిక సంఘం సిఫార్సు ద్వారా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధికి సమానంగా నిధులు ఇస్తున్నామని ప్రకటించారు. గ్రామాల రూపురేఖలను మార్చేస్తున్నామని తెలిపారు. సభ ఆమోదంతో చట్టాలు చేసి అమలు చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామానికి పంచాయతీరాజ్ కార్యదర్శులను నియమించామని పేర్కొన్నారు. తెలంగాణకు సమీపంలో ఏ రాష్ట్రం కూడా లేదని వెల్లడించారు. ప్రజల మధ్య, గ్రామగ్రామాన చర్చ జరగాలని సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై విస్తృతంగా ప్రత్యేక చర్చ జరగాలని కోరారు.
నయాపైసా లెక్కిలు చూపిస్తాం...
తాము ఏం చేసినా ఒక విధానం ప్రకారమే చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. సర్పంచులకు అన్ని హక్కులు కల్పించి స్వేచ్ఛ ఇచ్చామని గుర్తు చేశారు. పన్నులు వసూలు చేసుకునే బాధ్యతను పంచాయతీలకే అప్పగించామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సర్పంచులకు ప్రత్యామ్నాయ వ్యవస్థను తయారు చేశారని విమర్శించారు. గతంలో కలుషిత నీరు తాగి మరణాలు సంభవించాయని ఆరోపించారు. సర్పంచులు చాలా ధైర్యంగా పని చేసుకుంటున్నారని ఈ సందర్భంగా సభలో పేర్కొన్నారు. పంచాయతీలకు ఎన్ని నిధులు కేటాయించామో సభకు తెలుపుతామన్నారు. పంచాయతీలకు ఇచ్చిన నిధుల వివరాలన్ని సభ ముందు ఉంచుతామని వెల్లడించారు. నయా పైసా సహా అన్ని లెక్కలు సభ ముందు ఉంచుతామన్నారు.
ఇదీ చూడండి:
Harish Rao in Assembly 2021: సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు త్వరలోనే శ్రీకారం