తెలంగాణ

telangana

ETV Bharat / state

వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం - హైదరాబాద్ వార్తలు

Chief Minister KCR review
ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ సమీక్ష, సీఎం కేసీఆర్ తాజా వార్తలు

By

Published : Mar 29, 2021, 5:27 PM IST

Updated : Mar 29, 2021, 7:17 PM IST

17:25 March 29

వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని... ఇందుకోసం గ్రామాల్లో 6,408 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరోనా విజృంభన నేపథ్యంలో రైతుల ప్రయోజనాల కోసం నిరుటిలాగే గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. కొనుగోళ్ల కోసం పౌరసరఫరాలసంస్థకు రూ.20వేల కోట్ల గ్యారంటీని రేపటికల్లా పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలపై ప్రగతిభవన్​లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్... పంటల కొనుగోళ్లపై చర్చించారు. 

6,408 కొనుగోలు కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందులో 2,131 ఐకేపీ కేంద్రాలు, 3,964 పీఏసీఎస్ కేంద్రాలు, 313 ఇతర కేంద్రాలుంటాయని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాలసంస్థకు అవసరమైన రూ.20 వేల కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని... సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల తక్షణ ఏర్పాటు కోసం అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసరంగా దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్​ను ఆదేశించారు. హైదరాబాద్​లోనే ఉండి కొనుగోలు కేంద్రాల ఏర్పాటును, ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సూచించారు.  

రైతులకు ఇబ్బందులు లేకుండా

వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి, అధికారులకు కేసీఆర్​ స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే విషయంలో కనీస మద్దతు ధర నిబంధనలను కచ్చితంగా పాటించాలని రైతులను ముఖ్యమంత్రి కోరారు. వడ్లు ఎండబోసి తాలు లేకుండా 17 శాతం తేమకు మించకుండా ధాన్యాన్ని తీసుకురావాలన్నారు. కొనుగోళ్ల కోసం అవసరమైన 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. యాసంగిలో 52 లక్షలా 76వేల ఎకరాల్లో వరిపంట పండిందని... దాదాపు కోటీ 17 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 21 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.  

స్థలాలను ఎంపిక చేయండి

రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని కేసీఆర్​ అన్నారు. మంచి నాణ్యతతో పాటు ఎక్కువ దిగుబడి, అధిక ధర లభించే అవకాశం ఉన్నందున రానున్న వానాకాలంలో 75 నుంచి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించేందుకు సిద్ధం కావాలని రైతులను సీఎం కోరారు. అందుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేయాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్ రెడ్డిని ఆదేశించారు. 20 నుంచి 25 లక్షల ఎకరాల్లో కందిసాగు కోసం చర్యలు తీసుకోవాలని చెప్పారు. పత్తి, కంది పంటలకు నీళ్ల తడులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుందని తెలిపారు. ఆహార ధాన్యాల నిల్వ కోసం అదనపు గోదాములను నిర్మించేందుకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్న సీఎం... కార్పొరేషన్​కు లీజుకు ఇచ్చేందుకు స్థలాలను ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

ఇదీ చదవండి:నోముల వారసుడికే నాగార్జునసాగర్ టికెట్

Last Updated : Mar 29, 2021, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details