అబద్ధాలతో నడిచే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ప్రతి విషయంలోనూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆక్షేపించారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది ఏమీ లేదని అన్నారు. చట్టప్రకారం రావాల్సినవి, చేయాల్సినవి కూడా చేయడం లేదని వివరించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించాలని కేసీఆర్ మరోమారు డిమాండ్ చేశారు. పంజాబ్ తరహాలో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ఆయన... ఇదే డిమాండ్‌తో శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో రైతుల పక్షాన తెరాస ధర్నాలు చేస్తుందని ప్రకటించారు. ధాన్యంపై వైఖరిని స్పష్టం చేసే వరకు కేంద్ర ప్రభుత్వాన్ని, భాజపాను వదిలపెట్టబోమన్నారు. భాజపా నేతలను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు (cm kcr warning to bandi sanjay).
పిట్ట బెదిరింపులకు భయపడేదిలేదు
రైతుచట్టాలను ఎందుకు ఉపసంహరించుకోరని ప్రశ్నించిన కేసీఆర్... పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించిన సెస్‌ను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏడేళ్లుగా లేనిది ప్రజల తరఫున నిలదీసిన వెంటనే దేశద్రోహిని అయ్యానా అని ప్రశ్నించారు. దేశ భూభాగం గజం కూడా ఇతర దేశాలు ఆక్రమించుకోరాదంటే దేశద్రోహులు అవుతారా... లేక వదిలిపెట్టినవాళ్లు ద్రోహులు అవుతారా అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరి విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారని... ఈడీ, ఆదాయపన్ను దాడులు చేయిస్తూ కేసులు పెడుతున్నారని అన్నారు. పిట్టబెదిరింపులకు భయపడబోమన్నారు. ఎలాంటి విచారణలకైనా తాము సిద్దమని మరోమారు ప్రకటించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడితే అది వికటిస్తుందని అన్నారు.
దేశంలో సమూల సంస్కరణలు రావాల్సిఉంది..
దేశంలో ప్రకృతి, భగవంతుడు ఇచ్చినవన్నీ ఉండి కూడా కేంద్ర ప్రభుత్వాల చేతగానితనంతో ఆశించిన మేర అభివృద్ధి జరగడం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. చైనా, సింగపూర్ లాంటి దేశాలు అద్భుతంగా దూసుకెళ్తోంటే... మనదేశంలో మాత్రం ఇంకా కులం, మతం పేరిట భావోద్వేగాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో సమూల సంస్కరణలు రావాల్సి ఉందని అన్నారు. దేశాన్ని క్రాప్ కాలనీలుగా విభజించి డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని అన్నారు.
నువ్వేమైనా ట్రాక్టర్ డ్రైవర్‌వా...? అక్కడికొస్తే ఆరు ముక్కలవుతావు