తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: పల్లెలు, పట్టణ ప్రగతే లక్ష్యం.. పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం - cm kcr latest news

పల్లెలు, పట్టణాల సంపూర్ణ అభివృద్ధికి అందరి భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తాను స్వయంగా ఓ జిల్లాను దత్తత తీసుకుని పల్లె, పట్టణప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ప్రకటించారు. అధికారులు కంకణబద్ధులై గ్రామాలు, పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 20వ తేదీ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తానన్న సీఎం.. ఆ సందర్భంగా అధికారుల పనితీరు బేరీజు వేసి అలక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గ్రామసభలు నిర్వహించని సర్పంచులు, కార్యదర్శులను సస్పెండ్ చేయాలని.. తెరాస సర్పంచులు ఉంటే ముందు వారిపైనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉత్తమ విధానాలు అధ్యయనం చేసేందుకు ఆయా దేశాలు, రాష్ట్రాలకు అధికారుల బృందాలను పంపాలని ఆదేశించారు.

పల్లెలు, పట్టణ ప్రగతే లక్ష్యం.. పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం
పల్లెలు, పట్టణ ప్రగతే లక్ష్యం.. పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించం

By

Published : Jun 14, 2021, 5:10 AM IST

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధి సాధించేందుకు అందరూ భాగస్వాములు కావాలని, తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అదనపు కలెక్టర్లు, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ అధికారులు కంకణబద్ధులు కావాలని, గ్రామాలు, పట్ణణాల ప్రగతిని యజ్ఞంలా భావించి కృషి చేయాలన్నారు. ఈ నెల 20న సిద్దిపేట, కామారెడ్డి, 21న వరంగల్‌ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు తాను తనిఖీలు చేస్తానని చెప్పారు. అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు తేలితే క్షమించే ప్రసక్తి లేదని, తక్షణమే కఠిన చర్యలుంటాయన్నారు. తన పర్యటనలకు వారం రోజుల సమయం ఉన్నందున లోపాలుంటే సరిదిద్దుకోవాలని ఆదేశించారు. గ్రామసభలు నిర్వహించకపోతే గ్రామ కార్యదర్శులను, సర్పంచులను సస్పెండ్‌ చేయాలని, తెరాస సర్పంచులు తప్పు చేస్తే ముందు వారిపైనే చర్యలు తీసుకోవాలన్నారు. పల్లెలు, పట్టణాల ప్రగతిపై సీఎం కేసీఆర్‌ అదనపు కలెక్టర్లు, డీపీవోలతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు హన్మంతు షిండే, విద్యాసాగర్‌రావు, చిరుమర్తి లింగయ్య, పట్నం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

లే అవుట్లలోని వసతుల ఆస్తులపై దృష్టి
‘గ్రామసభలు నిర్వహించి, గ్రామ ఆర్థిక నివేదికలపై చర్చలు చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత డీపీవోలదే. పంచాయతీ ఉద్యోగుల జీతాలు, కరెంటు బిల్లులు, ట్రాక్టర్‌ కిస్తీల చెల్లింపు, హరిత పనులు... వీటికి నిధులు కేటాయించిన తర్వాతే మిగతా వాటికి చెల్లించాలి. పల్లె వనాలకోసం ప్రభుత్వ భూమి లేకుంటే ప్రైవేటు భూమిని కొనుగోలు చేయాలి. పట్టణాల్లో స్థిరాస్తి లే అవుట్ల విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అవి పట్టణాలు క్రమపద్ధతిలో అభివృద్ధి చెందేలా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఆ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్‌, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు, మంచినీటి ట్యాంకు తదితరాలకు కేటాయించిన స్థలాలను కూడా లే అవుట్‌ యజమానులు అమ్ముకుంటున్నారు. వాటిని ముందే పురపాలికల పేరు మీద రిజిస్టర్‌ చేయించాలి. రోడ్ల విస్తరణకు సంబంధించి మాస్టర్‌ప్లాన్‌లో ఎప్పటికప్పుడు మారిన పరిస్థితులను నమోదు చేయాలి. నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ భూమి రికార్డుల బ్యాంకు ఏర్పాటు చేయాలి. స్వాత్రంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా, మనిషి చనిపోతే ఎక్కడ దహన సంస్కారాలు చేయాలో తెలియని దుస్థితిలో ఈ దేశం ఉంది. గ్రామాల్లో వైకుంఠధామాలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలి. వానాకాలం ప్రారంభమైనందున హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి 15 రోజుల్లో ముగించాలి. స్థానిక సంస్థల సమస్యల తక్షణ పరిష్కారం కోసం అత్యవసర మంజూరు కోసం ప్రతి జిల్లా అదనపు కలెక్టర్‌కు రూ.25 లక్షల చొప్పున తక్షణమే కేటాయిస్తున్నాం. కలెక్టరు కార్యాలయ గది పక్కనే అదనపు కలెక్టర్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి వారికి ప్రొటోకాల్‌ గౌరవాన్ని మరింత పెంచుతాం.

గ్రామాలను కాపాడండి... మిమ్మల్ని కాపాడుకోండి
తెలంగాణలో ప్రగతిపథాన సాగుతున్న పంచాయతీరాజ్‌ వ్యవస్థను మరింత గొప్పగా తీర్చిదిద్దే బాధ్యత యువ అదనపు కలెక్టర్లపై ఉంది. డీపీవోలను వారు తమ వెంట నడిపించుకుపోవాలి. పాతపద్ధతులను వదిలి, నిత్యనూతన మార్గంలో పనిచేయాలి. ‘ప్రజలను, గ్రామాలను కాపాడండి.. మిమ్మల్ని మీరు కాపాడుకోండి’ (సేవ్‌ ద పీపుల్‌ సేవ్‌ ద విలేజెస్‌ సేవ్‌ యువర్‌ సెల్ఫ్‌) అని నినాదం ఇవ్వాలి. సామాజిక ఉద్యమానికి రూపకల్పన చేసిన ఎస్‌కే డే ఆశయాల మేరకు అభివృద్ధిని సాధించాలి.

శాఖల మధ్య సమావేశాలు
జిల్లా, పురపాలక, మండల స్థాయుల్లో వివిధ శాఖల మధ్య సమావేశాలు నిరంతరం నిర్వహించాలి. ప్రజాప్రతినిధులు, అధికారులకు పునశ్చరణ తరగతులు క్రమం తప్పకుండా జరపాలి. నర్సరీలు, కూరగాయలు, మాంసం మార్కెట్లు, మరుగుదొడ్లు, వైకుంఠధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతి పట్టణానికి మంత్రి, అధికారులు కలిసి నివేదికను తయారు చేయాలి. పట్టణాల్లో మహిళలకు టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో వీటి నిర్వహణపై అధ్యయనం చేయడానికి మూడు, నాలుగు దేశాలకు ఒక అధికారుల బృందాన్ని పంపించాలి. మిషన్‌ భగీరథ తాగునీరు పట్టణాలకు పూర్తిస్థాయిలో అందుతోంది. అంతర్గతంగా పైప్‌లైన్ల సమస్యను పరిష్కరించుకోవాలి. మార్కెట్ల ఏర్పాటు కోసం అదనపు కలెక్టర్లు సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌, గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్లను పరిశీలించాలి.

మలేరియా నిర్మూలన దశకు చేరాం
‘ఈ సీజన్‌లో ముందస్తు చర్యలతో వైరల్‌, సీజనల్‌ వ్యాధులను గణనీయంగా అరికట్టగలిగాం. మలేరియా నిర్మూలన దశకు చేరుకున్నాం. మరో మూడేళ్లు కష్టపడితే శ్రీలంకలా తెలంగాణ మలేరియా రహిత రాష్ట్రంగా అవతరిస్తుంది. బస్తీ దవాఖానాలు బాగా పనిచేస్తున్నాయి. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు 29 నుంచి 55 శాతానికి పెరిగాయి. టీకాల ప్రక్రియ కొనసాగిస్తూనే ఉండాలి. అన్ని స్థాయుల్లో సీజనల్‌ వ్యాధుల నివారణకు శాఖల వారీగా సమన్వయం అవసరం’ అని సీఎం తెలిపారు.

అదనపు కలెక్టర్లకు కొత్త కియాకార్లు
రాష్ట్ర ప్రభుత్వం 32 జిల్లాల అదనపు కలెక్టర్లకు సమకూర్చిన కొత్త కియా కార్నివాల్‌ కార్లను రవాణా మంత్రి అజయ్‌కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌లు ప్రారంభించారు.

24 అంతస్తులతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి

వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తాం. తాజాగా ఏడు వైద్య కళాశాలలను మంజూరు చేశాం. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థానంలో దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తాం. దీన్ని 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాంకేతిక హంగులతో హరితభవనంగా తీర్చిదిద్దుతాం. అత్యవసర రోగులను తరలించేందుకు హెలిపాడ్‌ను ఏర్పాటు చేస్తాం. కెనడాలో మాదిరి ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించేలా నిర్మించాలి. ఇందుకోసం అధికారులు కెనడాలో పర్యటించి రావాలి.

పల్లెల్లో రాత్రి బస...పొద్దున్నే పర్యటనలు..

మీరు పల్లెల్లో రాత్రి బసచేయాలి. ఉదయం లేచి జనంలో తిరిగితే క్షేత్రస్థాయి కష్టాలు తెలుస్తాయి. ఇందుకోసం మీకు నూతన వాహనాలను ఇప్పటికే సిద్ధం చేశాం. పల్లె, పట్టణ ప్రగతి కోసం నెల నెలా క్రమం తప్పకుండా నిధులిస్తున్నాం. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో పోస్టులను నూటికి నూరు శాతం భర్తీ చేశాం. ఆర్థిక వనరులున్నాయి. వ్యక్తిగత పనితీరు నివేదిక ద్వారా అదనపు కలెక్టర్ల పనితీరును నమోదు చేస్తాం. గ్రామాల్లో కార్యదర్శి పోస్టు ఖాళీ ఉండరాదు. ఎక్కడ అవసరమున్నా అక్కడ తక్షణమే నియమించే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చాం.

అదనపు కలెక్టర్‌తో కలిసి పనిచేస్తా

నుకున్న పనిని విద్యుక్తధర్మంగా భావించి నిర్వహిస్తే ఫలితాలు తప్పకుండా సాధించగలం. నేను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుంటా. అదనపు కలెక్టరు, నేను కలిసి పనిచేస్తాం. అభివృద్ధి ఎందుకు జరగదో చేసి చూపిస్తాం. గ్రామాభివృద్ధిలో కేరళ ఆదర్శంగా నిలిచింది. కొంతమంది అదనపు కలెక్టర్లను, డీపీవోలను అక్కడికి పంపించాలి. దిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ కూడా ఆదర్శంగా తీసుకుంది.

ఇదీ చూడండి: టీకా వేసుకోరా? అయితే ఫోన్‌ బ్లాక్‌, జీతం కట్​!

ABOUT THE AUTHOR

...view details