తెలంగాణ

telangana

ETV Bharat / state

2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది లక్ష్యం: సీఎం కేసీఆర్ - సమీకృత మార్కెట్ల నిర్మాణంపై కేసీఆర్ స్పీచ్

CM KCR on Veg and Non Veg Markets Construction : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్ల అంశంపై చర్చ జరిగింది. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మోండా మార్కెట్‌ మాదిరిగా.. రాష్ట్రంలో మార్కెట్లు నిర్మించాలని కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. అదేవిధంగా కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తున్నామని.. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు.

CM KCR
CM KCR

By

Published : Feb 12, 2023, 12:42 PM IST

CM KCR on Veg and Non Veg Markets Construction: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలతో చర్చ మొదలైంది. శాసనసభలో బస్తీ దవఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, మామిడి మార్కెట్, పంట రుణాల మాఫీ, కోతుల బెడద, అక్షరాస్యత అంశాలు ప్రశ్నోత్తరాల్లో చర్చకు వచ్చాయి. దాంట్లో భాగంగా సమీకృత వ్యవసాయ మార్కెట్లు, కల్తీ విత్తనాల గురించి పలువురు ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడిగారు.

CM KCR Speech in Assembly: వీరి ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా శాస్త్రీయ దృక్పథంతో రాష్ట్రవ్యాప్తంగా వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు నిర్మిస్తున్నామని శాసనసభలో చెప్పారు. భూమిపై కూరగాయలు పెట్టి విక్రయిస్తే బ్యాక్టీరియా ముప్పు ఉంటుందన్నారు. మోండా మార్కెట్‌ మాదిరిగా.. రాష్ట్రంలో మార్కెట్లు నిర్మించాలని కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అధునాతన మార్కెట్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

'హైదరాబాద్‌లో జనాభాకు అనుగుణంగా మార్కెట్లు లేవు. గతంలో ఆరేడు మార్కెట్లు మాత్రమే ఉండేవి. గతంలో శాస్త్రీయ దృక్పథం లేకుండా మార్కెట్లు ఏర్పడ్డాయి. నిజాం కాలం నాటి మోండా మార్కెట్‌ శాస్త్రీయతతో ఏర్పాటైంది. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో సరిపడా మార్కెట్లు లేవు. హైదరాబాద్‌లో మార్కెట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించాం. సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లకు శ్రీకారం చుట్టాం.'- సీఎం కేసీఆర్

కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు: అధునాతనమైన మార్కెట్‌లు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నామని సీఎం కేసీఆర్ శాసనసభలో తెలిపారు. కనీసం 2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు కావాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని అసెంబ్లీలో వెల్లడించారు. నియోజకవర్గాల్లో మార్కెట్ల నిర్మాణం పనులు జరుగుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల అధికారులు చూసి స్ఫూర్తి పొందుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. కల్తీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తున్నామని.. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు.

ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై సాధారణ చర్చతో పాటు పద్దులపై కూడా ఇప్పటికే చర్చ పూర్తయ్యింది. శాసనసభలో గత మూడు రోజులుగా మొత్తం 37 పద్దులపై చర్చించి ఆమోదించారు. ప్రశ్నోత్తరాల అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చ జరుగుతుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details