KCR on TRS MLAs Poaching Issue: తెరాస ఎమ్మెల్యేలకు ఎర అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో నిర్వహించిన సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. భారమైన మనస్సుతో దుఃఖంతో మాట్లాడుతున్నానని తెలిపారు. దేశంలో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రజాస్వామ్య హత్య నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా జరుగుతోందని తెలిపారు. నలుగురు తెరాస ఎమ్మెల్యేలతో నిందితులు రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్ చర్చల వీడియోను ప్రదర్శించారు. ఎమ్మెల్యేలకు ఎరవేసిన వారు మోదీ, అమిత్షా, బి.ఎల్.సంతోశ్, జేపీ నడ్డాల పేర్లు బహిరంగంగానే ప్రస్తావించారని కేసీఆర్ తెలిపారు. రూ.100 కోట్లయినా ఇస్తామని, ఎలాంటి సమస్య రాకుండా చూస్తామని వీడియోలో తెలిపారని పేర్కొన్నారు. వీటిని చూస్తే రాజ్యాంగేతర శక్తుల చేతుల్లో భారత ప్రభుత్వం ఉందని అర్థమవుతోందని తెలిపారు. దీనిని అరికట్టకపోతే అందరికీ ప్రమాదమని ఆవేదన వ్యక్తం చేశారు.
KCR on TRS MLAs Buying Issue : దేశంలో ఇప్పటికే 8 రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టామని వీడియోలో చెప్పారని కేసీఆర్ తెలిపారు. ఇది రాజకీయమా? ప్రజాస్వామ్యామా? అని ప్రశ్నించారు. వేరే రాష్ట్రాల్లో అమ్ముడుపోయారేమె కానీ తెలంగాణ చైతన్య గడ్డ కావడంతో ఇక్కడ పట్టుకున్నామని స్పష్టం చేశారు. రాజకీయ సహచరునిగా.. రాజ్యంగబద్ధమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్న వ్యక్తిగా ఈ దుశ్చర్యను, దాడిని ఆపాలని ప్రధాని మోదీని కోరుతున్నట్లు కేసీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
"మోదీ జీ ఇంతకముందు కూడా మీకు సలహా ఇచ్చాను. ఇవాళ కూడా సలహాలిస్తున్నాను. ఈ దుశ్చర్య, దాడిని ఆపండి. ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడండి. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిని అరెస్టు చేసి విచారణ జరిపించండి. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతూ, భయాందోళనలకు గురిచేస్తూ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ చర్యలు దేశానికి, మీకు ఎవరికీ మంచిని చేకూర్చవు. నేను చాలా దుఃఖంతో ఈ విషయాన్ని చెబుతున్నాను. మీ పేరు(మోదీ ), మీ హోంమంత్రి(అమిత్షా) పేరు చెప్పి చేస్తున్న అనైతిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయండి. ఇవి ఎంతవరకు న్యాయం?" - సీఎం కేసీఆర్