cm kcr on command control central: కమాండ్ కంట్రోల్ కేంద్రం రూపకర్త డీజీపీ మహేందర్‌రెడ్డి అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్... రాష్ట్ర పోలీసుశాఖకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణానికి ఎంతో శ్రమించారని ప్రశంసించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నిర్మాణంలో ఆర్‌అండ్‌బీ కూడా కృషి చేసిందని పేర్కొన్నారు.
పోలీసులకు నా సెల్యూట్: లక్ష్యాల సాధనలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయన్న సీఎం కేసీఆర్... రాష్ట్రంలో ఎక్కడ విపత్తు తలెత్తినా పోలీసుశాఖ ముందుంటుందని వెల్లడించారు. ఉత్తమ పోలీసు వ్యవస్థ ఉంటే సమాజం బాగుంటుందని చెప్పారు. సమాజ హితం కోసం సంస్కరణలు తీసుకొస్తున్న పోలీసులకు సెల్యూట్ అని అన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని సూచించారు. మాజీ డీజీపీల వద్ద అమూల్యమైన ఆలోచనలు ఉన్నాయని.. ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారతీయుల వ్యక్తిత్వ పటిమ చాలా శక్తివంతమైందని వివరించారు. వ్యక్తులుగా గొప్పవాళ్లం.. బృందంగా విఫలమవుతామని తెలిపారు. పట్టుదల, లక్ష్యంపై ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఉద్ఘాటించారు.
త్వరలో మరో రూపంలో మహేందర్‌రెడ్డి సేవలు:సైబర్ క్రైమ్స్ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సైబర్ క్రైమ్స్‌పై దృష్టిసారించాలని ఆదేశించారు. భవిష్యత్ తరాల బంగారు భవితను డ్రగ్స్ నాశనం చేస్తోందని ఆవేదన చెందారు. నేరాన్ని నియంత్రించేందుకు పోలీసుశాఖ ప్రధాన పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం ఏకే ఖాన్ అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. డీజీపీ మహేందర్‌రెడ్డి డిసెంబర్‌లో పదవీవిరమణ చేస్తున్నారని తెలిపారు. మహేందర్‌రెడ్డి సేవలను మరో రూపంలో తీసుకుంటామన్నారు.
''హైదరాబాద్ నగరంలో చాలా వరకు నేరాలు తగ్గాయి. నేర నియంత్రణలో హైదరాబాద్ పోలీసుల ప్రతిభ అద్భుతం. నేరగాళ్లు కొత్త రూపాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం పోలీసుశాఖకు సంపూర్ణ మద్దతు, ప్రోత్సాహం అందిస్తుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పడాలనేదే నా అభిమతం. హైదరాబాద్‌లో ఇంత పెద్ద సెంటర్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. సంకల్ప బలానికి ప్రతీక కమాండ్ కంట్రోల్ కేంద్ర భవనం. '' - కేసీఆర్, ముఖ్యమంత్రి
తెలంగాణ పోలీసు ఒక కలికితురాయి:భారతదేశ వ్యవస్థకే తెలంగాణ పోలీసు ఒక కలికితురాయి అని కేసీఆర్ అభివర్ణించారు. నేరాలు చేసే విధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయన్న సీఎం కేసీఆర్... అమెరికా విధానాలను అమలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. పోలీస్‌శాఖకు ప్రభుత్వ అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. భారతదేశానికే తెలంగాణ పోలీసుశాఖ ఆదర్శంగా నిలవాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పడాలనేదే తన అభిమతం అని వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుందని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నారు. సంకల్ప బలానికి ప్రతీక కమాండ్ కంట్రోల్ కేంద్ర భవనం అని తెలిపారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీసులు మరింత సేవ చేయాలని కోరుతున్నట్లు వివరించారు.
కమాండ్ కంట్రోల్ ప్రత్యేకతలివే...
- హైదరాబాద్‌లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే తెలుసుకునేలా సీసీటీవీ కెమెరాలన్నీ ఒకే చోట అనుసంధానం చేస్తూ నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఈ కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
- ఏకకాలంలో లక్ష సీసీ కెమెరాలు వీక్షించేలా ఏర్పాటు చేసిన బాహుబలి తెర
- ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో 5 టవర్లు ఏర్పాటు
- టవర్- 'ఏ'లో 20అంతస్థులు ఉన్నాయి. ఇందులోని నాలుగో అంతస్తులో డీజీపీ ఛాంబర్, ఏడో అంతస్తులో సీఎం, సీఎస్ ఛాంబర్లు ఉన్నాయి. 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది.
- టవర్ 'డీ'లో తెలంగాణ పోలీస్ చరిత్రను, ప్రాసస్త్యాన్ని తెలిపేలా మ్యూజియం ఏర్పాటు చేశారు. మొదటి కొత్వాల్ రాజ బహుదూర్ కాలం నుంచి పోలీస్ వ్యవస్థ ఎలా పని చేసిందని వివరాలు తెలిపే ఫొటో గ్రాఫ్స్‌ను ఉంచారు.
- గతంలో నేరస్తులను పట్టుకోవడంతో పాటు వారి కదలికలను గుర్తించడానికి వినియోగించిన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ సాధనాలను అందుబాటులో ఉన్నాయి.
- టవర్-ఈలో కమాండ్ కంట్రోల్ డాటా సెంటర్ ఉంది.
ఇవీ చూడండి: