తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Speech : 'ఐకమత్యంతో జాతి ఔన్నత్యం చాటాలి'

CM KCR Speech Today : జాతిపిత గాంధీజీనీ కొందరు కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని.. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడుగానే ఉంటాడని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మనం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఎందరో ప్రాణత్యాగం చేశారని తెలిపారు. అనేక త్యాగాలు, పోరాటాలతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్న ముఖ్యమంత్రి.. ఏ దేశానికికైనా స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూప సందర్భమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు అద్భుతంగా జరగాలని ఆకాంక్షించారు.

CM KCR Speech Today
CM KCR Today Speech

By

Published : Aug 8, 2022, 2:05 PM IST

Updated : Aug 8, 2022, 2:20 PM IST

CM KCR Speech : 'ఐకమత్యంతో జాతి ఔన్నత్యం చాటాలి'

CM KCR Speech Today : అనేక త్యాగాలు, పోరాటాలతో దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్​ పేర్కొన్నారు. గాంధీజీ ఎన్నో త్యాగాలు చేసి.. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించారని తెలిపారు. ఎన్నో దేశాల్లో స్వాతంత్య్ర పోరాటాలకు గాంధీజీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఏ దేశానికికైనా స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూప సందర్భమన్న కేసీఆర్​.. స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో నేతలు జీవితాలు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. కొత్త తరం వారికి స్వాతంత్య్ర పోరాట సందర్భ ఘటనలు తెలియవని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్​.. ఉద్యమకారులను ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం దారుణంగా అణచివేసిందని తెలిపారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా జరగాలని ఆకాంక్షించారు.

పేదరికం తొలగిపోతేనే అభివృద్ధి..: ''ఆసేతు హిమాచలం పోరాటం జరిపి స్వాతంత్య్రం తెచ్చారు. స్వాతంత్య్రం వచ్చాక ఈ దేశాన్ని కలిపి ఉంచేందుకు ఎంతో కష్టపడ్డారు. వందల మంది సంస్థానాల అధిపతులను ఒప్పించారు. రాజభరణాలు ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌, జునాగఢ్‌, ఇండోర్‌, హైదరాబాద్‌.. దేశంలో విలీనమయ్యాయి. ఎన్నో వ్యయ ప్రయాసల తర్వాత పుదుచ్చేరి, గోవా, సిక్కిం కలిశాయి. పేదరికం ఉన్నంత కాలం దేశంలో అలజడులు, అశాంతి ఉంటాయి. దేశంలో పేదరికం పూర్తిగా తొలగిపోతేనే అభివృద్ధి సాధిస్తాం. ఈ దేశం నాదనే అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కలగాలి.

మహాత్ముడు ఎప్పుడూ మహాత్ముడే..: జాతిపిత గాంధీజీనీ కొందరు కించపరిచేలా ప్రవర్తిస్తున్నారు. మహాత్ముడు ఎప్పటికీ మహాత్ముడుగానే ఉంటాడు. మనం స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఎందరో ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిఢవిల్లుతున్నాయి. చిల్లర మల్లర చేష్టలను ప్రతి ఒక్కరూ చీల్చి చెండాడాలి. ఐకమత్యంతో ఉండి ఈ జాతి ఔన్నత్యం చాటాలి.'' అని కేసీఆర్​ వ్యాఖ్యానించారు.

కేసీఆర్​ శ్రీకారం.. అంతకుముందు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు హైదరాబాద్ హెచ్​ఐసీసీలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కళాకారులు ఈ వజ్రోత్సవాల్లో పాల్గొన్నారు. హెచ్​ఐసీసీకి చేరుకున్న కేసీఆర్ మొదటగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత చిత్రపటానికి పూల మాల వేసి.. వజ్రోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు.

స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా హెచ్​ఐసీసీలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేదికపై 75 మంది కళాకారులతో నిర్వహించిన వీణావాయిద్య ప్రదర్శన వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. శాండ్‌ ఆర్ట్‌తో స్వతంత్ర పోరాట ఘట్టాల ప్రదర్శన అందర్ని భావోద్వేగానికి గురి చేసింది. వేదికపై దేశభక్తి ప్రబోధ నృత్యం, ఫ్యూజన్ డ్యాన్స్, లేజర్ షో అలరించాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించిన షెడ్యూల్​ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా జాతీయ జెండా ఎగురవేసేందుకు ప్రభుత్వం 1.2 కోట్ల జెండాలను పంపిణీ చేయనుంది. ఈ నెల 9 నుంచి 21 వరకు రాష్ట్రంలో 562 సినిమా హాళ్లలో ఉదయం పూట పాఠశాలల విద్యార్థుల కోసం రిచర్డ్‌ అటెన్‌బరో నిర్మించిన 'గాంధీ' చిత్రాన్ని ప్రదర్శిస్తారు. ఈ నెల 21న శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి పింఛనుకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

Last Updated : Aug 8, 2022, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details