CM KCR Inaugurated Telangana Martyrs Memorial : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరుల స్మారకార్థం నిర్మించిన.. అమరవీరుల స్మారకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులపై రూపొందించిన ప్రదర్శనను మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం తిలకించారు. అమరజ్యోతిని ముఖ్యమంత్రి ప్రారంభించారు.అమరుల కుటుంబాలను సన్మానించిన అనంతరం మాట్లాడిన సీఎం కేసీఆర్..తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల సందర్భంగా జరిగిన ఘట్టాలను గుర్తు చేశారు.
CM KCR Latest Comments : ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగినా.. ధైర్యంగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించి తీరామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమర జ్యోతి ఏర్పాటు చేశామన్నారు. అత్యుత్తమంగా నిర్మించుకున్నందునే.. కొంత జాప్యం జరిగిందని వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు సాయమందిస్తూ... తమ ప్రభుత్వం పురోగమిస్తోందని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ సాధనలో అమరులైన వారి ప్రాణాలకు ఎప్పటికీ వెలకట్టలేమంటూ.. ఆనాటి ఘటనలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇకమీదటా ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
'రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. ఈరోజు రెండు పార్శ్వాలు కలగలిసిన రోజు. సంతోషం ఒక పాలు.. విషాదం రెండు పాళ్లుగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పేర్లు తలచుకోవాలి. ఖమ్మం జిల్లా ఇల్లందులో ఉద్యమ తొలి కేక వినిపించింది. ఉద్యమాన్ని ప్రారంభించే ముందు పిడికెడు మందితో మేధోమధనం చేశాం. వ్యూహాత్మకంగా మలిదశ ఉద్యమం ప్రారంభించాం. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది. ఆయన మార్గదర్శనంలోనే నడిచాం. ఉద్యమ స్ఫూర్తిని జయశంకర్ కాపాడుకొంటూ వచ్చారు. ఉద్యోగులు, విద్యార్థులను ఉద్యమంలోకి రానివ్వవద్దని మొదట్లో అనుకున్నాం'-సీఎం కేసీఆర్