CM KCR Speech at BRS Training Camp in Nanded : దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర నాందేడ్‌లో భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్.. వారికి దిశానిర్దేశం చేశారు. రెండు రోజుల పాటు ఈ శిక్షణా శిబిరం కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
దేశం మొత్తం తెలంగాణ మోడల్‌ను కోరుకుంటుంది..: ఈ సందర్భంగా స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా సమస్యలు పరిష్కారం కాలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మన చుట్టు పక్కల ఉన్న దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో రోజూ మంచి నీరు ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్.. ఇలా పాలకులు మారినా భారత్‌లో మార్పు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్‌ను కోరుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
'దేశం మొత్తం మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆవిర్భవించింది. చాలా చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా గొప్పగా అభివృద్ధి చెందాయి. కర్ణాటక ఫలితాలు చూసి కొందరు ఏదేదో మాట్లాడుతున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఏం జరిగింది. ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీలు కాదు.. ప్రజలు. అమూల్యమైన నీటిని కూడా వాడుకోలేక వృథా చేస్తున్నాం. ఏటా వేల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. వ్యవసాయానికి నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.'-సీఎం కేసీఆర్