తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Nagpur Tour Updates : 'మహారాష్ట్రలో త్వరలోనే పరివర్తన వస్తుంది.. అది దేశమంతా పాకుతుంది' - ప్రతిపక్షాలపై తీవ్ర ఆరోపణలు గుప్పించిన కేసీఆర్

CM KCR Comments in Nagpur Tour : దేశంలో జల విధానం సమూలంగా మారితేనే మార్పు సాధ్యమవుతుందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు. విద్యుత్‌ విషయంలోనూ ఎన్నో సమస్యలున్నాయన్న ముఖ్యమంత్రి.. దేశంలో బొగ్గుతో 150 ఏళ్లు కరెంట్‌ ఇవ్వొచ్చన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుహిత కార్యక్రమాలతో వ్యవసాయాన్ని పండగలా మార్చామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో అనేక మంది నేతలు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారన్న కేసీఆర్.. త్వరలోనే లక్షల సంఖ్యలో పార్టీ సభ్యత్వాలు నమోదవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

CM KCR
CM KCR

By

Published : Jun 15, 2023, 7:48 PM IST

CM KCR Speech at Nagpur Meeting : రైతులు తలచుకుంటే ఏదైనా చేయగలరు.. ఎలాంటి మార్పునైనా సాధించగలరని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.మహారాష్ట్రలో తెలంగాణ నమూనా పాలన వచ్చేవరకూ బీఆర్‌ఎస్ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌... అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.

రెవెన్యూ వ్యవస్థలోని అవినీతిని పారదోలాలా.. వద్దా? : తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను డిజిటలైజ్‌ చేసి అవినీతికి అడ్డుకట్ట వేశామని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ క్రమంలోనే రెవెన్యూ వ్యవస్థలోని అవినీతిని పారదోలాలా.. వద్దా అని ప్రశ్నించారు. తెలంగాణలో పండిన పంటంతా ప్రభుత్వమే కొంటోందన్న సీఎం.. పంట సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు వివరించారు. ఉచిత విద్యుత్‌, సాగు నీటితో సాగును పండగలా మార్చామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ ఇప్పుడు వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటేసిందని స్పష్టం చేశారు. తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రమే ఇన్ని సాధిస్తే.. మహారాష్ట్ర ఎందుకు సాధించదని కేసీఆర్‌ ప్రశ్నించారు.

'ఇప్పటికీ వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ప్రపంచంలో భారత్‌లోనే ఎక్కువ శాతం సాగుయోగ్యమైన భూమి ఉంది. మనం తలచుకుంటే దేశంలోనే ప్రతి ఎకరానికీ సాగునీరు ఇవ్వొచ్చు. భగవంతుడు ఎన్నో వనరులు సమృద్ధిగా ఇచ్చినా ప్రజలకు ఎందుకీ కష్టాలు. జల విధానం సమూలంగా మారితేనే మార్పు సాధ్యమవుతుంది. విద్యుత్‌ విషయంలోనూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. దేశంలో బొగ్గుకు కొరత లేదు. అయినా విద్యుత్‌ సమస్య ఉంది. దేశంలోని బొగ్గుతో 150 ఏళ్లు విద్యుత్‌ ఇవ్వొచ్చని కోల్‌ ఇండియానే చెప్పింది.'-సీఎం కేసీఆర్

తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ లభిస్తోంది :గతంలో తెలంగాణలో మహారాష్ట్ర కంటే ఎక్కువగా రైతు ఆత్మహత్యలు జరిగేవని కేసీఆర్ పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌ లభిస్తోందన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిపోయాయని వివరించారు. అదేవిధంగా తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తున్నామన్న సీఎం కేసీఆర్.. తాగు నీరు కోసం బిందెలు పట్టుకుని తిరిగే పరిస్థితి తెలంగాణలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. తెలంగాణలా చేస్తే మహారాష్ట్ర దివాలా తీస్తుందని కొందరు మరాఠా నేతలు అంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు.

'తెలంగాణ తరహాలో చేస్తే మరాఠా నేతలు దీపావళి జరుపుకుంటారు. మహారాష్ట్రకే వెళ్తున్నారు.. మా మధ్యప్రదేశ్‌కు రావట్లేదని అక్కడి ప్రజలు అంటున్నారు. మహారాష్ట్రలో అనేక మంది నేతలు బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు. త్వరలోనే లక్షల సంఖ్యలో బీఆర్‌ఎస్ సభ్యత్వాలు నమోదవుతాయి. మహారాష్ట్రలో త్వరలోనే పరివర్తన వస్తుంది.. అది దేశమంతా పాకుతుంది. నాగ్‌పుర్‌లో ఆఫీసు ప్రారంభించుకున్నాం. ఔరంగాబాద్‌, పుణెలోనూ త్వరలో ఆఫీసు ప్రారంభిస్తాం.'-ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details