తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల పోరాట పటిమకు వందనం.. బంద్​లో పాల్గొంటం: కేసీఆర్

రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్​కు తెరాస పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఈ నెల 8న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో జాతీయ రహదారులను దిగ్బందిస్తామని తెరాస కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ వెల్లడించారు. మంత్రుల నుంచి తెరాస గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, రైతు బంధుసమితి సభ్యులు రైతులకు మద్దతుగా జాతీయ రహదారులపై నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. వీరితో పాటు వ్యాపార సంస్థలు కూడా రెండు గంటల పాటు దుకాణాలు మూసివేసి మద్దతు తెలపాలని కోరారు.

cm kcr said trs activists are participate in the Bharat Bandh
భారత్​ బంద్​లో మా శ్రేణులు పాల్గొంటారు: కేసీఆర్​

By

Published : Dec 7, 2020, 4:55 AM IST

Updated : Dec 7, 2020, 6:29 AM IST

దేశవ్యాప్తంగా ఈనెల 8న రైతులు తలపెట్టిన భారత్‌ బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల న్యాయమైన పోరాటాన్ని తాము సమర్థిస్తున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులన్నీ బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటాయని ఆదివారం ఒక ప్రకటనలో కేసీఆర్‌ వెల్లడించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను తెరాస వ్యతిరేకించిందని చెప్పారు. ఆ చట్టాలను ఉపసంహరించుకునేంత వరకు పోరాడాలన్నారు. బంద్‌లో పాల్గొని రైతులకు అండగా నిలవాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

మంత్రి కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశం

రాష్ట్ర రైతుల పక్షాన బంద్‌

దిల్లీలో రైతులు ఎముకలు కొరికే చలిలో ప్రదర్శిస్తున్న పోరాట పటిమకు తమ పార్టీ తరఫున సెల్యూట్‌ చేస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. వారికి పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా మద్దతు తెలుపుదామన్నారు. భారత్‌ బంద్‌లో కేంద్రం వైఖరిని ఎండగడతామన్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌ఛార్జులు, పార్టీ అనుబంధ రైతు విభాగ కార్యవర్గ సభ్యులు, రైతుబంధు సమితి సభ్యులు పాల్గొంటారన్నారు. రైతులకు సంఘీభావంగా జాతీయ రహదారులపై ధర్నాలు, రాస్తారోకోలు జరపాలన్నారు. రాష్ట్ర రైతుల పక్షాన బంద్‌లో వ్యాపార, వాణిజ్యవేత్తలతోపాటు లారీలు, ట్రక్కులు, ఇతర రవాణా సంస్థల యజమానులు, వాహనాలు, అన్నివర్గాల ప్రజలు పాల్గొని బంద్‌కు సహకరించాల్సిందిగా కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. రోజూ ఉదయం 10 గంటలకు దుకాణాలు తెరిచే వ్యాపారులు.. బంద్‌ నేపథ్యంలో మంగళవారం రైతులకు సంఘీభావంగా రెండు గంటలు షాపులు మూసి, 12 గంటల నుంచి తెరవాలని విన్నవించారు. ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం తర్వాతే తమ కార్యకలాపాలు కొనసాగించాలని కేటీఆర్‌ కోరారు.

రైతులకు తీవ్ర నష్టం

‘‘తెరాసది రైతు ప్రభుత్వం. స్వయాన రైతు అయిన కేసీఆర్‌ వారి సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేసేందుకు కుట్ర చేస్తోంది. కేంద్రం తెచ్చిన మూడు చట్టాలతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నల్ల చట్టాల ద్వారా అన్నదాతలకు కనీసం మద్దతు ధర రాకుండా పన్నాగం పన్నింది. వ్యవసాయ చట్టాలను పార్లమెంట్‌లోనే తెరాస తీవ్రంగా వ్యతిరేకించి.. వ్యతిరేకంగా ఓటు వేసింది. రాజ్యసభలో మా పార్లమెంటరీ పార్టీ నేత కేకే ఓటింగు (డివిజన్‌) కోరినా వినకుండా భాజపా బిల్లులను ఆమోదించింది. దేశంలో రైతు లేకపోతే ఎవరికి అన్నం లేదు. ఎన్నో పురోగమన చర్యలను తీసుకువచ్చిన రాష్ట్రంగా, ఒక అభ్యుదయ రైతుగా సీఎం కేసీఆర్‌ కేంద్ర చట్టాలను వ్యతిరేకించారు. దేశంలోని రైతులకు సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారు. కార్పొరేట్‌ శక్తుల గుప్పిట్లో వ్యవసాయం ఏరకంగా బందీ కాబోతుందన్న విషయమై ఎండగట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. దిల్లీలో ఎముకలు కొరికే చలిలో రైతులు చేస్తున్న ఆందోళన కేసీఆర్‌ మనసును చలింపజేసింది’’ అని కేటీఆర్‌ తెలిపారు.

పెద్దఎత్తున కార్యక్రమాలు

అంతకుముందు నగర ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో మాట్లాడుతూ, రైతుల బంద్‌కు మద్దతుగా హైదరాబాద్‌లో కూడా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ర్యాలీలు నిర్వహించాలని, తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీగల్లీ బందు కావాలని సూచించారు. సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, మహమూద్‌అలీ, సబితారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కేకే, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఆందోళనకు పూనుకోవడం గొప్ప విషయం

రైతులే స్వయంగా వ్యవసాయ చట్టాలపై ఆందోళనకు పూనుకోవడం గొప్ప విషయమని, ఈ పోరాటానికి సీఎం కేసీఆర్‌ వెన్నుదన్నుగా నిలుస్తారని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో యాసంగి, ఖరీఫ్‌ కలిపి కోటి లక్షా ఎకరాల్లో వరి పండించామని.. కానీ ఎక్కువ చెల్లింపులు చేయకుండా కేంద్రం ఆదేశాలు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకుందన్నారు. పెరుగుతున్న వ్యవసాయ దిగుబడులను ప్రోత్సహించాల్సిన కేంద్రం కార్పొరేట్లకు లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటోందన్నారు.

ఇదీ చూడండి :ఇవాళ యాసంగి రైతుబంధు విడుదలపై కేసీఆర్​ సమీక్ష

Last Updated : Dec 7, 2020, 6:29 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details