ఇప్పటికే తెలంగాణ ప్రారంభించిన అనేక పథకాలను వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. దళితబంధు కూడా దేశానికి ఆదర్శంగా మారుతుంది. దీనికి హుజూరాబాద్ ప్రేరణగా నిలవబోతోంది. అక్కడి బిడ్డలుగా మీ అందరికీ ఇది ఎంతో సంతోషకరం. ఈ పథకం వల్ల మంచి జరిగి వెలుతురొస్తే అణగారిన దళిత వర్గాలందరికీ ఒక మార్గమవుతుంది. పార్టీలకతీతంగా దళితబంధును అమలు చేసుకుందాం.
దళిత జాతిలో ఇక ఎవ్వరూ పేదలుగా మిగలకూడదు. దళిత బంధు.. కేవలం పథకం మాత్రమే కాదు. గతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టినట్టుగా వారి అభ్యున్నతి కోసం సాగే ఉద్యమం. ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఒకరి అభివృద్ధికోసం ఒకరు పాటుపడే యజ్ఞం.
ఇంకా సమాజాన్ని వరకట్నం, అంటరానితనం వంటి పలు వివక్షలు పీడిస్తున్నాయి. వాటిని విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ది ద్వారా పారదోలవచ్చు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితరులకు ప్రభుత్వం ఆసరాగా నిలిచింది. వారి కళ్లలో సంతోషం కనిపిస్తోంది. అదే రీతిన దళిత సమాజం మోములో ఆనందాన్ని చూడాలన్నదే మా పట్టుదల.- సీఎం కేసీఆర్
తెలంగాణలో అర్హులైన వారందరికీ దళిత బంధు పథకం అందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన కుటుంబాలనే మొదటి ప్రాధాన్యంగా ఎంపిక చేస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి దశల వారీగా దీనిని రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. రూ.80 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ‘‘ఈ పథకం విజయవంతం కోసం దళిత బిడ్డలంతా పట్టుబట్టి పనిచేయాలి. ప్రతి దళితవాడలో ఒక కేసీఆర్ పుట్టాలె. ఈ పథకం యావత్ దేశానికి ఆదర్శమై దేశంలోని దళితులందరినీ ఆర్థిక, సామాజిక వివక్ష నుంచి విముక్తులను చేయబోతోంది’’ అని చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని దళిత సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, కార్యకర్తలు శనివారం ప్రగతిభవన్‌కు వచ్చారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బండా శ్రీనివాస్‌ను నియమించడంపై వారు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు.
నాటి ప్రశ్నలకు స్వరాష్ట్రంలో దీటుగా బదులిచ్చాం...
‘‘తెలంగాణ ప్రజలు గత పాలనలో గొర్రెల మందలో చిక్కుకుపోయిన పులి పిల్లల్లాంటి వాళ్లనే సంగతిని స్వయంపాలన వచ్చాక ప్రపంచం గమనించింది. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశం నేడు ఆశ్చర్యపోతోంది. రాజులు, జాగీర్దార్లు జమీందార్లు, భూస్వాములు, అనంతరం వలస పాలకులు.. ఇలా 100 ఏళ్ల పాటు అనేక రకాల పీడనను అనుభవించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అన్ని రంగాలను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ఉద్యమం ప్రారంభించిన మొదట్లో తెలంగాణ వస్తదా అని అనుమానించారు... వచ్చింది. 24 గంటల కరెంటు సాధ్యమేనా అన్నారు... సాధ్యం చేసి చూపాం. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు అయ్యేదేనా అని సంశయించారు.. అది కూడా అయింది. దండగన్న వ్యవసాయాన్ని పండగ చేశాం. రైతుబంధు తెచ్చినప్పుడు కొందరు పెదవి విరిచారు. ఇప్పుడు తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారు. రోహిణీ కార్తెలోనే నాట్లేసుకునే రోజులొచ్చాయి. అలాగే దళిత బంధును కూడా కొందరు అనుమానిస్తున్నారు. వాటినన్నింటినీ పటాపంచలు చేస్తాం. విజయం సాధిస్తాం.
ఆర్థిక సాయం నేరుగా బ్యాంకు ఖాతాలోకి..