రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల ఆర్థిక అవసరాలు, స్థితిగతులు పరిశీలిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రం నలుదిక్కులా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. చింతకాని, తుంగతుర్తి, చారగొండ, నిజాంసాగర్ మండలాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వాసాలమర్రి, హుజూరాబాద్‌లో ఇప్పటికే నిధుల విడుదల చేసినట్లు చెప్పారు. దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టుపై సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ భేటీకి మంత్రులు, అధికారులతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించే 4 మండలాలకు కూడా 2, 3 వారాల్లోనే దశలవారీగా నిధులు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 4 మండలాల్లోని అధికారులు గ్రామాలకు తరలి రావాలని ఆదేశించారు.
ఏటా రెండు లక్షల దళిత కుటుంబాలకు..
దళితబంధు రూపకల్పన అసెంబ్లీ సాక్షిగా జరిగిందని సీఎం వివరించారు. ఎస్సీలను ఆర్థికంగా, వ్యాపార వర్గంగా నిలబెట్టాలని సంకల్పించినట్లు చెప్పారు. దళిత ఎంపవర్‌మెంట్ కింద రూ.1,000 కోట్లు అసెంబ్లీలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. ఆర్థిక, సామాజిక వివక్షను తరిమికొట్టాలనే ఆశయంతో దళిత బంధు తీసుకొచ్చినట్లు సీఎం పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది నుంచి బడ్జెట్‌లో దళితబంధుకు రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు. ఏటా రూ.20 వేల కోట్లు తగ్గకుండా కేటాయిస్తామని ప్రకటించారు. సంవత్సరానికి రెండు లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే ఇంకా నిధులు పెంచుకుంటూ పొతామన్నారు. ఆ తరువాత వరుస క్రమంలో ఇతర కులాల్లోని పేదలకు ఈ పది లక్షల సహాయం అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని వివరించారు.