తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు - cm kcr latest news

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నియంత్రణకు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. లాక్‌డౌన్‌తో పాటు కట్టడి చర్యలను ముమ్మరం చేస్తామని వెల్లడించారు.

KCR review with officials and ministers on corona control measures
కరోనా కట్టడికి మరిన్ని కీలక నిర్ణయాలు

By

Published : Apr 18, 2020, 6:23 AM IST

రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసుల సంఖ్య పెరగటంపై చర్చించినట్లు తెలిసింది. వ్యాధి నివారణకు అన్ని చర్యలూ చేపట్టాలని అభిప్రాయపడ్డారు. కరోనాను పూర్తిస్థాయిలో అదుపు చేసేందుకు తాజా కార్యాచరణను రూపొందిస్తామని వెల్లడించారు. పేదలకు రేషన్‌, నగదు పంపిణీ, ధాన్యం కొనుగోళ్లు ఇతర అంశాలపై సీఎం చర్చించి, ఆదేశాలు జారీచేశారు.

కేంద్ర మార్గదర్శకాలపై...

మరోవైపు ఈ నెల 20 తర్వాత కేంద్రం జారీచేసే మార్గదర్శకాలను అమలు చేయాలా? వద్దా?.. అనే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో శుక్రవారం విస్తృతంగా చర్చించారు. ఉదయం సీనియర్‌ మంత్రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు సడలింపులు వద్దని, ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నందున మరింత కఠినంగా లాక్‌డౌన్‌ కొనసాగించాలని కోరారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సడలింపులను ఇస్తున్నందున ఇతర రంగాలకు వాటి అవసరం లేదని వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు ఉన్నతాధికారులు సైతం సడలింపులపై విముఖత వ్యక్తంచేసినట్లు తెలిసింది. సడలింపులపై ప్రచారం కారణంగా జనసంచారం పెరుగుతోందని, ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరించాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్లతోనూ సీఎం ఫోన్‌లో మాట్లాడగా సడలింపుల వల్ల ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని వారిలో పలువురు వెల్లడించినట్లు సమాచారం.

ఇదీ చూడండి:రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. వారం రోజుల్లో 279 మందికి నిర్ధరణ

ABOUT THE AUTHOR

...view details