Heavy Rains in Telangana: గత మూడు, నాలుగు రోజులుగా కాస్త శాంతించిన వరుణుడు.. ఈరోజు ఉదయం నుంచి మళ్లీ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు మళ్లీ ఉప్పొంగుతున్నాయి. రహదారులన్నీ మినీ చెరువులుగా దర్శనమిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది.
ఈ క్రమంలోనే వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్‌కుమార్, నీటి పారుదలశాఖ అధికారులు, ఈఎన్సీలతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వ, వరద ప్రాంతాలు, ఇతర అంశాలపై సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని పని చేయాలని సూచించారు.