ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వ్యవసాయ ఆస్తుల ప్రక్రియ సాఫీగా సాగుతోన్న తరుణంలో ఇతర ఆస్తులపై కూడా సర్కార్ దృష్టి కేంద్రీకరించింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రారంభం, సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు
అవినీతికి ఆస్కారం లేని పారదర్శక విధానంలో, సులువుగా, సత్వరమే భూలావాదేవీలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగా ధరణి పోర్టల్ ద్వారా భూ లావాదేవీలు కోర్ బ్యాంకింగ్ విధానంలో ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సహా ఇతరత్రా లావాదేవీలన్నీ ధరణి ద్వారానే జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ కూడా ఏక కాలంలో చేస్తున్నారు. అటు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను సైతం ధరణి ద్వారా ప్రారంభించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. గత రెండు నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో వీలైనంత త్వరగా వాటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.