తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలోనే రైతులకు డబ్బులు.. యాసంగి సాగుపై నేడు సమీక్ష - telangana cm kcr review meeting

కేంద్రం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకోవడం వల్ల దేశంలో వాటి కొనుగోలుపై ప్రభావం చూపనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశంలో మక్కల దిగుమతి వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు.. రాష్ట్రంలో వాటి సాగుపై ఏం చేద్దామనే విషయమై శనివారం సమావేశంలో విస్తృతంగా చర్చిద్దామన్నారు.

cm kcr to give money to farmers
త్వరలోనే రైతులకు డబ్బులు.. యాసంగి సాగుపై నేడు సమీక్ష

By

Published : Oct 10, 2020, 7:57 AM IST

కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకోవడంతో దేశంలో వాటి కొనుగోలుపై ప్రభావం చూపనుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కరోనా ముప్పును తప్పించి రైతుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రామాల్లోనే ఆరు వేల కొనుగోలు కేంద్రాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేస్తామని చెప్పారు.

'‘పంటలు కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలోనే రైతులకు డబ్బులు చెల్లించాలి. దీని కోసం అన్ని ఏర్పాట్లను ముందుగానే చేయాలి' అని సీఎం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వారితో మాట్లాడుతూ..దేశంలో మక్కల దిగుమతి వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులు.. రాష్ట్రంలో వాటి సాగుపై ఏం చేద్దామనే విషయమై శనివారం సమావేశంలో విస్తృతంగా చర్చిద్దామన్నారు.

పంటల కొనుగోలుపై కార్యాచరణ

రాష్ట్రంలో యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంటల సాగు విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రగతిభవన్‌లో వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఆ రెండు శాఖల మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌లు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. పంటల కొనుగోలు కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించారు.

ధాన్యం కొనుగోలుకు రూ. 14వేల కోట్లు

ప్రస్తుత వానాకాలంలో ధాన్యం కొనుగోలు కోసం సుమారు రూ. 14 వేల కోట్లు అవసరమని పౌరసరఫరాల సంస్థ అంచనా వేసింది. ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు ప్రతిపాదించిన దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అవసరమైన మొత్తాన్ని వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.

మక్కలపై మల్లగుల్లాలు

రాష్ట్రంలో మక్క(మొక్కజొన్న) పంట ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ఈ యాసంగిలో మక్కల సాగు 8 లక్షల ఎకరాల వరకూ ఉండవచ్చని జిల్లాల వ్యవసాయాధికారులు ప్రభుత్వానికి తాజాగా నివేదించారు. ఈ లెక్కన ఫిబ్రవరి నాటికి మార్కెట్లకు 80 లక్షల క్వింటాళ్లకు పైగా పంట రావచ్చని అంచనా. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ పంటకు సరైన ధర దక్కకపోవచ్చని.. యాసంగిలో ఈ పంట సాగు తగ్గిస్తేనే మేలనే అభిప్రాయాన్ని వ్యవసాయశాఖ వ్యక్తం చేస్తోంది. ఈ అంశాన్ని శనివారం సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాక చర్చించి యాసంగి పంటల సాగు ప్రణాళిక ఖరారు చేస్తామని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ‘ఈనాడు’కు చెప్పారు.

ఇదీ చదవండిఃకొవిడ్‌ కాలంలోనూ మధుమేహం, రక్తపోటు ఔషధాల కొరత

ABOUT THE AUTHOR

...view details