CM KCR Review on Godavari Water : రాష్ట్రంలో వర్షపాతం, గోదావరి, కృష్ణా తదితర నదుల్లో నీటి లభ్యత.. జలాశయాల్లో నీటినిల్వలు, ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ డిమాండ్, తదితర పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో గోదావరి పరీవాహక ప్రాంతం మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, నీటిపారుదల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి లభ్యత, తాగు, సాగునీటి అవసరాలు, విద్యుత్ డిమాండ్ తదితర వివరాలను అధికారులు వివరించారు.
వర్షాభావ పరిస్థితులతో దేశవ్యాప్తంగా నెలకొన్న కరవు పరిస్థితి.. రాష్ట్రంలో రానీయకుండా కాళేశ్వరం సహా గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ.. జలాశయాల్లో నిల్వలు ఉండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని.. జలాశయాల్లో నీటి నిల్వలను నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. నీటిపారుదల, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేసి, చుక్క చుక్క ఒడిసిపట్టి ప్రజలకు అందించాలని అధికారులకు కేసీఆర్ సూచించారు.
ప్రాణహిత ద్వారా చేరుకుంటున్న జలాలను.. ఎప్పటికప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా ఎత్తిపోస్తూ.. మధ్యమానేరు నుంచి దిగువ మానేరు, పునరుజ్జీవ వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి చెరిసగం నీటిని ఎత్తిపోయాలని కేసీఆర్ తెలిపారు. తద్వారా అటు కాళేశ్వరం చివరి ఆయకట్టు సూర్యాపేట వరకు.. ఇటు ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కష్టకాలంలోనే తెలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతగా కష్టపడ్డారో.. అదే స్థాయిలో వచ్చిన నీటిని వచ్చినట్టు ఎత్తిపోస్తూ.. తాగు, సాగునీటికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత అధికారులపై ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇన్నాళ్లు ఒకెత్తు, ఇప్పుడు ఒకెత్తన్న ఆయన.. ఇది నీటిపారుదలశాఖకు పరీక్షా సమయమని వ్యాఖ్యానించారు. ఎగువ గోదావరి నుంచి నీరు రాకున్నా, ప్రాణహిత ద్వారా నీరు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని.. ప్రతి రోజూ ఒక టీఎంసీ నీటిని మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్లకు ఎత్తిపోసేలా మోటార్లను నిరంతరంగా 24 గంటలు నడిపిస్తూనే ఉండాలని కేసీఆర్ చెప్పారు.
CM KCR Review on Godavari Water Availability :ఇది మునుపటి తెలంగాణ కాదన్న కేసీఆర్.. గతంలో లాగా ఆలోచిస్తే కుదరదని అన్నారు. వర్షాభావ పరిస్థితి లాంటి సందర్భాలు వచ్చినప్పుడే మన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంక్షోభ సమయంలోనే పంటలు పండించి చూపించాలన్న ముఖ్యమంత్రి.. అప్పుడే సిపాయిలం అనిపించుకుంటామని వ్యాఖ్యానించారు. అన్ని వ్యవస్థలు సమన్వయం చేసుకుంటూ, ఎవరి పని వారు సమర్థంగా నిర్వహిస్తూ తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ వెల్లడించారు.
ఈ పరిస్థితిని సవాలుగా తీసుకోవాలని.. ఈ ఒక్క సంవత్సరం అనుభవం భవిష్యత్ తెలంగాణ చరిత్రలో ఉపయోగపడుతుందని అధికారులు, ఇంజనీర్లకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈఎన్సీలు ఎక్కడికక్కడే ఉండి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు నీరు అందించడమే లక్ష్యంగా నిరంతరం ఏకాగ్రతతో పనిచేసేలా అందరమూ కలిసి ప్రతిజ్ఞ తీసుకోవాలని స్పష్టం చేశారు. తాగునీటి అవసరాల కోసం జలాశయాల్లో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ సమస్య రాకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీని ముఖ్యమంత్రి ఆదేశించారు.
KCR Review on Monsoon Situation in TS :ఉదయ సముద్రం, కోయిల్ సాగర్ జలాశయాల్లో.. కొంత నీటిఎద్దడి ఉందని.. వాటిలో నీటి నిల్వలను సిద్ధంగా ఉంచుకోవాలని కేసీఆర్ తెలిపారు. పాలేరు జలాశయానికి నాగార్జునసాగర్ నుంచి నీరు వచ్చే అవకాశాలు లేనందున.. బయ్యన్నవాగు నుంచి సందర్భానుసారం నీటిని వదిలేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పంపింగ్ నిర్వహణను ప్రైవేట్ గుత్తేదార్లు కాకుండా.. ప్రభుత్వ రంగ సంస్థ జెన్కోకు ఇచ్చేలా విధివిధానాల ఖరారు కోసం చర్యలు చేపట్టాలని నీటిపారుదలశాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
CM KCR Review with Ministers : ఈ క్రమంలోనే ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ చెప్పారు. కష్టకాలంలో ప్రజలు, రైతాంగం నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. వ్యవసాయశాఖ అధికారులు, నీటిపారుదలశాఖ ఇంజనీర్ల సూచనలు పాటిస్తూ పంటలు పండించుకోవాలని కోరారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతాంగం, వ్యవసాయాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
ఇప్పటికే వేసిన పత్తి, తదితర విత్తనాలు వర్షాభావ పరిస్థితుల్లో మొలకలెత్తకుండా ఎండిపోయిన నేపథ్యంలో.. విత్తనాలు, ఎరువులు తిరిగి అందించేలా ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు నివేదికలను ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిరోజూ ఉదయాన్నే అందించాలన్న సీఎం.. వాటిని అనుసరించి మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలిస్తూ, అప్రమత్తం చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు.
ఇవీ చదవండి:CM KCR Review : 'వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం'
Delay Rains Telangana : వర్షాల ఆలస్యంతో సాగుకి నష్టం