వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటి పంపింగ్ ప్రారంభించిన వెంటనే మొదట ఆయా ప్రాజెక్టుల పరిధిలో గల చెరువులన్నింటినీ నింపాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీనికోసం ప్రాజెక్టుల కాల్వల నుంచి అవసరమైన తూములు, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రాజెక్టుల వద్ద రివర్ గేజ్‌లు ఏర్పాటు చేయాలని.. నీటి నిర్వహణ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రియల్ టైమ్ డాటా ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఎన్నో వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
3 రోజుల్లో సమావేశం కావాలి
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఈ వర్షాకాలం అవలంభించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రస్తుత పరిస్థితిని, ఈ వానాకాలంలో ఎంత ఆయకట్టుకు నీరందించగలిగే విషయాలపై సీఎం ఆరా తీశారు. చెరువులకు నీరు అందించడానికున్న అడ్డంకులపై చర్చించేందుకు ఆయా జిల్లాల మంత్రులు, అధికారులు రెండు మూడు రోజుల్లోనే సమావేశం కావాలని ఆదేశించారు. చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని.. ఫలితంగా బోర్ల ద్వారా కూడా వ్యవసాయం సాగుతుందన్నారు. చెరువుల నుంచి రైతులు స్వచ్ఛందంగా మట్టిని తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలని.. అధికారులు రైతులపై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని పేర్కొన్నారు.
"ఈ వర్ష కాలంలో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు పరిధిలో 16,41,284 ఎకరాలకు సాగునీరు అందించాలి. గోదావరిలో పై నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎస్ఆర్ఎస్పీని కాళేశ్వరం ద్వారా నింపాలి. ఎల్ఎండీ నుంచి దిగువకు నీరందించడానికి ప్రస్తుతమున్న కాలువ కేవలం ఆరు వేల క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో ఉంది. దీని సామర్థ్యాన్ని 9వేల క్యూసెక్కులకు పెంచాలి. ప్రస్తుతమున్న కాల్వ సామర్థ్యం పెంచడమా? సమాంతరంగా మరో కాలువ నిర్మించాలా? అనే విషయాన్ని ఈఎన్సీల కమిటీ తేల్చాలి. కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోసే పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. వచ్చే వర్షాకాలం నుంచి మూడో టీఎంసీని వాడుకోవాలి."
-సీఎం కేసీఆర్
దేవాదులకు 365 రోజులు నీటిని లిఫ్ట్ చేయాలి
తోటపల్లి కాలువ ద్వారా 77 వేల ఎకరాలకు నీరందించాలని సీఎం స్పష్టం చేశారు. గౌరవల్లి లిఫ్టు పనులు వెంటనే పూర్తి చేసి, ఈ సీజన్ లోనే నీళ్లు అందించాలని ఆదేశించారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా వరంగల్ జిల్లాలోని అన్ని చెరువులు నింపాలన్నారు. సమ్మక్క బారేజ్ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టు 365 రోజులూ నీటిని లిఫ్టు చేయాలని చెప్పారు. వరద కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని... వరద కాలువలపై ఓటీల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. మల్లన్న సాగర్ ద్వారా తపాస్‌పల్లి రిజర్వాయర్ నింపి, అక్కడి నుంచి మోత్కూరు, అడ్డగూడూరు, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి, చిల్పూర్ మండలాలకు నీరందించాలని చెప్పారు. జగిత్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని ముక్కట్రావుపేట గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అమలు చేయాలన్నారు.