తెలంగాణ

telangana

ETV Bharat / state

KCR Review on VRAs and VAOs Adjustment : వీఆర్‌ఏల సర్దుబాటు.. వారంలో ప్రక్రియ పూర్తి కావాలి..!

KCR Review on VRAs and VAOs Adjustment
KCR Review on VRAs and VAOs Adjustment

By

Published : Jul 11, 2023, 6:36 PM IST

Updated : Jul 12, 2023, 7:07 AM IST

18:35 July 11

KCR Review on VRAs and VAOs Adjustment : 'నీటి పారుదల, ఇతర శాఖల్లో వీఆర్​ఏలను సర్దుబాటు చేయండి'

CM KCR Review on JPS Regularization : గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్​ఏ)లను నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేసేలా కసరత్తు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా సబ్ కమిటీ ఇవాళ్టి నుంచి కసరత్తు ప్రారంభించనుంది. మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం... వీఆర్​ఏలను విద్యార్హతలు, సామర్థ్యాలను అనుసరించి నీటిపారుదల సహా ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని అన్నారు. మంగళవారం ప్రగతిభవన్​లో వీఆర్​ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి అన్ని శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్​ కీలక సూచనలు చేశారు.

వీఆర్​ఏలతో సమావేశమై, చర్చించి వారి అభిప్రాయాలను సేకరించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం కేటీఆర్ నేతృత్వంలోని ఉపసంఘం... వీఆర్​ఏలతో ఇవాళ్టి నుంచి చర్చలు ప్రారంభించాలని తెలిపారు. చర్చల అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం నిర్ణయాలు తీసుకొని వీఆర్​ఏల సేవలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉపసంఘం కసరత్తు పూర్తయి నివేదిక సిద్దమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మొత్తం ప్రక్రియ వారం లోపు పూర్తి కావాలని ఆదేశించారు.

గుడి, మసీదు, చర్చిల ప్రారంభం ఆగస్టు 25న :రాష్ట్ర సచివాలయంలో నిర్మిస్తున్న నల్ల పోచమ్మ దేవాలయం, మసీదు, చర్చిలను మూడింటిని ఆగస్టు 25న ఒకేరోజు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఆయా మతాల పెద్దలతో చర్చించిన అనంతరం ఈ తేదీని ఖరారు చేశారు. మూడు మతాల సంప్రదాయాలకు అనుగుణంగా ఆయా మతాల పెద్దల సమక్షంలో వాటిని సీఎం స్వయంగా ప్రారంభిస్తారు. ఈమేరకు మంగళవారం సచివాలయంలో సీఎస్‌ శాంతికుమారి, వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.

సింహభాగం నీటిపారుదల... మిషన్‌ భగీరథలకే :వీఆర్‌ఏల సర్దుబాటు, క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా నీటిపారుదల శాఖ, మిషన్‌ భగీరథలకే ఎక్కువ మందిని మళ్లించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో 23,046 వీఆర్‌ఏ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 21,433 మంది విధుల్లో ఉన్నారు. క్రమబద్ధీకరణ అనంతరం పేస్కేల్‌ కింద ఎంత మొత్తం చెల్లించాలనేది ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయిస్తుంది. వీఆర్‌ఏలలో పీజీ, డిగ్రీ లాంటి ఉన్నత విద్య పూర్తి చేసిన వారు దాదాపు 5వేల మంది ఉన్నారు. నీటిపారుదల శాఖలో సహాయకుల కింద 1,034 మందిని, లష్కర్ల కింద 4,374 మందిని, 3వేల మందిని మిషన్‌ భగీరథలో నియమించాలని భావిస్తున్నారు. మిగిలిన వారిలో కొందరిని రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ వంటి శాఖల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

వివిధ శాఖల్లో దిగువస్థాయి కేడర్‌ వివరాలను ప్రభుత్వం ఇటీవల తెప్పించుకుంది. వీరిలో ప్రత్యక్ష నియామక పద్ధతి కింద టీఎస్పీఎస్సీ ద్వారా ఎంపికైన 2,783 మందిని కొనసాగించే అవకాశాలున్నాయి. 60 ఏళ్లు నిండిన వారిని రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని భావిస్తున్నారు. గ్రామానికి ఒక వీఆర్‌ఏని కొనసాగించేందుకు కూడా ప్రభుత్వవర్గాలు ఆలోచిస్తున్నాయి. రాష్ట్రంలో 10,485 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. పెద్ద రెవెన్యూ గ్రామాలకు ఇద్దరిని ఏర్పాటు చేయాలనే ఆలోచనా ఉంది. అయితే ఐచ్ఛికాలు ఇచ్చి ఇతర శాఖలో సర్దుబాటు చేయాలని వీఆర్‌ఏ ఐకాస కోరుతున్న నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం తీసుకునే నిర్ణయం ఆధారంగా తుది కేటాయింపులు ఉండే అవకాశముంది. ప్రజలకు అందించే సేవలను దృష్టిలో పెట్టుకుని గ్రామానికి ఒక వీఆర్‌ఏను కొనసాగించాలని, దీనిపై గతంలో సీఎం ఇచ్చిన హామీ మేరకు నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని ట్రెసా రాష్ట్ర కార్యవర్గం మంగళవారం ఒక ప్రకటనలో కోరింది. వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేసింది

పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరణ : పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న జేపీఎస్​లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించుకున్నారు. సీఎం ఆదేశాలను మేరకు ప్రొబేషన్​ పూర్తయిన కార్యదర్శుల పనితీరు పరిశీలించనున్నారు. మూడింట రెండొంతుల లక్ష్యం చేరుకున్న వారిని క్రమబద్ధీకరించాలని అధికారులు నిర్ణయించుకున్నారు.

ఇవీ చూడండి..

Last Updated : Jul 12, 2023, 7:07 AM IST

ABOUT THE AUTHOR

...view details