సమ్మె ద్వారా ఆర్టీసీకి కార్మిక సంఘాలు తీవ్ర నష్టం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సంస్థ 150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని ఆయన తెలిపారు. ఇది పూడ్చలేని లోటు అని అభిప్రాయపడ్డారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కార్మిక సంఘాలు అనాలోచింతగా సమ్మెకు వెళ్లాయని.. ఎట్టి పరిస్థితుల్లో వారితో చర్చలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గడువులోగా విధుల్లో చేరని వారిని మళ్లీ తీసుకునే అవకాశం లేదని ప్రకటించారు.
కొత్త ఎండీ సాధ్యం కాదు...
ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఎండీ నియామకం సాధ్యంకాదనే విషయాన్ని న్యాయస్థానానికి వివరించాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు సర్కారు 44 శాతం ఫిట్మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిందని సీఎం గుర్తు చేశారు. ఎన్నడు లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 3 వేల 300 కోట్ల మేర ఆర్టీసీకి సాయం అందించినట్లు వెల్లడించారు.