వ్యవసాయంలో మార్పులకు స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్.. అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, మార్కెటింగ్ నిపుణులతో సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్షించారు. పంటల సాగు, అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి అంశాలు.. ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు రావాలని సీఎం సూచించారు.
భవిష్యత్‌లో తెలంగాణ వ్యవసాయం రూపురేఖలు మారాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వ్యవసాయాధారిత పరిశ్రమలకు ముడిసరుకు నిరంతరం అందేలా పంటలు ఉండాలన్నారు. రైతుల పంటలకు విలువ జోడించేలా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తులతో తెలంగాణకు బ్రాండ్ ఇమేజ్, అంతర్జాతీయ డిమాండ్ రావాలని కేసీఆర్ అభిలాషించారు.