తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విధివిధానాలపై కేసీఆర్​ సమీక్ష

అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు అవలంభించాల్సిన పద్ధతులపై ప్రగతి భవన్‌లో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్​... రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించారు.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు అవలంభించాల్సిన పద్ధతులపై సమీక్షించిన కేసీఆర్​
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు అవలంభించాల్సిన పద్ధతులపై సమీక్షించిన కేసీఆర్​

By

Published : Dec 13, 2020, 5:01 PM IST

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు అవలంభించాల్సిన పద్ధతులపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్షించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించారు. ఇందులో మంత్రులు కేటీఆర్​, ఎర్రబెల్లి దయాకర్ రావు, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా ఉంటారు. మూడు నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరిస్తారు. ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై ఆరా తీశారు. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూముల విషయంలో సైతం ఇలాంటి విధానమే రావాలని సీఎం కేసీఆర్​ ఆకాంక్షించారు.

'పలు కారణాల వల్ల 70-80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తాయి. ఇంకా జాప్యం కావద్దు. అన్ని సమస్యలు తొలగిపోయి సులభంగా, సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలి. హైదరాబాద్​లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వైభవంగా సాగుతోంది. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉండాలి. ప్రజలకు లేనిపోని కొత్త ఇబ్బందులు రావొద్దు. ప్రజలు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావొద్దు. ఏ అధికారి తన విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే వీలు ఉండొద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తీసుకుని మంచి విధానం తీసుకురావాలి. మంత్రి వర్గ ఉపసంఘం అందరితో చర్చించాలి. నగరాలు, పట్టణాల్లో ఎలాంటి సమస్యలున్నాయి? గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాటిని ఎలా పరిష్కరించాలి? ఇంకా మెరుగైన విధానం తీసుకురావాలంటే ఏమి చేయాలి? తదితర అంశాలపై కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి - సీఎం కేసీఆర్​

పేదలు సరైన డాక్యుమెంట్లు లేకుండానే ఇండ్లు నిర్మించుకున్నారు. వారికి కరెంటు బిల్లు, ఇంటి పన్ను, నీటి బిల్లులు వస్తున్నాయి. అలాంటి ఆస్తులను అమ్మి, కొనే సందర్భంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి కూడా మార్గం కనిపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

ఇదీ చూడండి:పోలీసు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని సీఎం ఆదేశం

ABOUT THE AUTHOR

...view details