CM KCR Review: పల్లెప్రగతి, పట్టణప్రగతితో పాటు ధాన్యంసేకరణ, సమీకృత మార్కెట్ల నిర్మాణం, వైకుంఠధామాలు, ప్రకృతివనాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, స్థానికసంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, నగరపాలికల మేయర్లు, కమిషనర్లతో ప్రగతిభవన్‌లో సీఎం సమావేశం కానున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరో దఫా పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇప్పటి వరకు నిర్వహించిన పల్లె,పట్టణప్రగతి అమలు, పురోగతిని కేసీఆర్ సమీక్షిస్తారు. అందులో చేపట్టిన పనులు, వాటి పురోగతి, పారిశుద్ధ్య నిర్వహణ, తదితరాలపై పూర్తి స్థాయిలో చర్చిస్తారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మరో విడత కార్యక్రమాల నిర్వహణ, ప్రణాళికపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారు.
బృహత్ ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణ పురోగతినిని కూడా సీఎం సమీక్షిస్తారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో సమీకృత శాఖాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. అందుకు అనుగుణంగా మార్కెట్ల నిర్మాణ పురోగతిపై సమావేశంలో ముఖ్యమంత్రి చర్చిస్తారు. మండలానికి ఒకటి చొప్పున బృహత్ ప్రకృతివనాల అభివృద్ధి, ఊరూరా వైకుంఠధామాల నిర్మాణంపై కూడా సమీక్షిస్తారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి మరో దఫా నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల అంశం కూడా ఇవాళ్టి సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపుల కోసం ఇప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగుతోంది.