తెలంగాణ

telangana

By

Published : Sep 24, 2020, 4:07 AM IST

ETV Bharat / state

కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు రక్షణ: సీఎం

భూవివాదాలు, ఘర్షణల నుంచి ప్రజలను శాశ్వతంగా రక్షించేందుకు వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. ఇందుకోసం వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న వారికి మెరూన్ కలర్ పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. పేదలకు చెందిన నోటరీ, 58, 59 జీవో పరిధిలోని ఇండ్లు, స్థలాలను ఉచితంగా క్రమబద్దీకరిస్తామని వెల్లడించారు. జీహెచ్​ఎంసీ సహా నగరపాలికల పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్లతో ముఖ్యమంత్రి ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

cm kcr review on new revenue act and dharani portal
కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు రక్షణ: సీఎం

కొత్త రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఆన్​లైన్‌లో నమోదు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. అందుకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించిన సీఎం.. అధికారులకు మార్గనిర్దేశం చేశారు. కొత్తగా అమలు చేయనున్న విప్లవాత్మకమైన రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి సహా ప్రజలందరి ఆస్తులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజల దీర్ఘకాలిక, విశాల ప్రయోజనాల కోసం.. భూ వివాదాలు , ఘర్షణల నుంచి శాశ్వతంగా రక్షించేందుకు వారి ఆస్తులకు పక్కా హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు.

వ్యవసాయేతర ఆస్తులు ఉచితంగా నమోదు

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగిన వారందరికీ మెరూన్ రంగులో పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్లు, వ్యవసాయ భూముల దగ్గర నిర్మించుకున్న గృహాలు, ఫామ్‌హౌజ్‌లు తదితర వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ.. ఉచితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని ప్రజలకు విజప్తి చేశారు. ఇక నుంచి భూలావాదేవీలు, బదలాయింపులు పూర్తిగా ధరణి పోర్టల్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్​ జరుగుతాయని కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ఆస్తుల వివరాలను మ్యుటేషన్ చేయించుకోని వారికి.. భవిష్యత్తులో ఆస్తులను పిల్లలకు బదిలీ చేసే విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని సీఎం హెచ్చరించారు.

పేదల ఇళ్లను క్రమబద్దీకరిస్తాం..

పేదలకు చెందిన ఇళ్ల స్థలాలను పూర్తిగా క్రమబద్దీకరిస్తామని.. దీంతో వారికి రక్షణ ఏర్పడడంతో పాటు ఆ ఆస్తుల మీద బ్యాంకు రుణాలు తీసుకునే వెసులుబాటు కూడా కలుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆస్తుల బదలాయింపునకు, ఎల్ఆర్ఎస్‌కు సంబంధం ఉండబోదన్న ఆయన.. ఇండ్ల నిర్మాణం పంచాయతీరాజ్, పురపాలక నిబంధనలకు లోబడే ఉంటుందని స్పష్టం చేశారు. దేవాదాయ, వక్ఫ్, ఎఫ్​టీఎల్​, నాలా, యూఎల్​సీ పరిధిలో నిర్మించుకున్న ఇళ్లకు మ్యుటేషన్ వర్తించదని స్పష్టం చేశారు. వ్యవసాయ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లు, తదితర ఆస్తులను ఉచితంగా నాలా బదలాయింపు చేయడం సహా.. అక్కడ నిర్మించుకున్న ఇళ్లు, తదితర ఆస్తుల విస్తీర్ణాన్ని వ్యవసాయ కేటగిరీ నుంచి తొలగించే విషయంలో స్థానికప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించాలని సీఎం సూచించారు.

సాదాబైనామాలకు చివరి అవకాశం

గ్రామాలు, పురపాలికల పరిధిలోని ప్రతి ఇంటి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఇంటి నంబర్ కేటాయించి పన్ను వసూలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ అధికారులకు స్పష్టం చేశారు. వ్యవసాయేతర ఆస్తులన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేసే విషయంలో పంచాయతీరాజ్, పురపాలక అధికారులు బాధ్యత తీసుకోవాలన్న ముఖ్యమంత్రి.. భవిష్యత్తులో ఆస్తుల నమోదు ప్రక్రియ, క్రమబద్ధీకరణ, ఉచిత నాలా బదలాయింపు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండబోదని.. ఇదే చివరి అవకాశమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సాదాబైనామాలతో భూముల పరస్పర కొనుగోళ్లకు సంబంధించి.. చివరిసారిగా ఉచితంగా మ్యుటేషన్ అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. నోటరీ, 58, 59 జీవోల పరిధిలోని పేదల ఇళ్లను ఉచితంగా క్రమబద్దీకరిస్తామని... ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వు జారీ అవుతుందని చెప్పారు.

కొత్త రెవెన్యూ చట్టం అమలు, ధరణి పోర్టల్ రూపకల్పన, వ్యవసాయేతర ఆస్తుల ఆన్‌లైన్‌ సహా.. నోటరీ, జీవో 58, 59 ఆస్తుల ఉచిత క్రమబద్దీకరణ తదితర అంశాలపై గ్రేటర్ హైదరాబాద్ సహా నగరపాలికల పరిధిలోని శాసనసభ్యులు, మేయర్లతో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నారు.

ఇవీ చూడండి: వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్​ కలర్ పట్టాదార్ పాస్​బుక్​: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details