కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రప్రభుత్వం గెజిట్ జారీ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్, అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రారావు, తదితరులతో సీఎం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. గెజిట్ నోటిఫికేషన్‌లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. గెజిట్‌లోని అంశాలను, వివరాలను అధికారులు, న్యాయవాదులు ముఖ్యమంత్రికి వివరించారు. గెజిట్ అమలుతో చోటుచేసుకునే పరిణామాలు, ప్రాజెక్టుల నిర్వహణ, ప్రభావం తదితర అంశాల గురించి సీఎం చర్చించారు.
గెజిట్‌లోని అంశాలు
బోర్డుల పరిధి, నిర్వహణ మార్గదర్శకాలపై గురువారం రాత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి బోర్డుల అధీనంలోకి వెళ్లనున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్నింటి నిర్వహణను ఇక నుంచి బోర్డులే చూసుకుంటాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున 60 రోజుల్లో సీడ్ మనీ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. నిర్వహణ ఖర్చుల్ని అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. అనుమతిలేని ప్రాజెక్టులకు ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలి. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తయినా వాటిని నిలిపివేయాల్సి ఉంటుంది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ వివరాలు పేర్కొంది.