తెలంగాణ

telangana

ETV Bharat / state

వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు.. సమీక్షలో కేసీఆర్ - నీటిపారుదలపై కేసీఆర్ రివ్యూ

ప్రాజెక్టుల ద్వారా వచ్చే నదీజలాల ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం కల్పించేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వానికి ఇంతకు మించిన ప్రాధాన్యం లేదన్న సీఎం... ఎంత ఖర్చైనా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రాజెక్టుల నీటితో ముందుగా చెరువులు, తర్వాత జలాశయాలు నింపాలన్న కేసీఆర్... చివరికి ఆయకట్టుకు నీరందించాలని చెప్పారు.

Cm kcr review on irrigation
వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు.. సమీక్షలో కేసీఆర్

By

Published : Jul 13, 2020, 4:38 AM IST

వివిధ ప్రాజెక్టుల కాల్వల ద్వారా ఇప్పటి వరకు సాగునీరు అందని ప్రాంతాలను గుర్తించి, వాటికి సాగునీరు అందించే ప్రణాళికపై ముఖ్యమంత్రి కేసీఆర్... ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో సీఎం సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా నదులపై ఎంతో వ్యయం చేసి, ఎన్నో అవరోధాలను అధిగమించి ప్రభుత్వం భారీ ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడంతో పాటు ఉద్యమ స్ఫూర్తితో చెరువులను పునరుద్ధరించిందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఫలితం ప్రజలకు అందాలంటే వీలైనంత ఎక్కువ వ్యవసాయ భూములకు సాగునీరు అందించడమే మార్గమని వ్యాఖ్యానించారు.

వినియోగించుకోండి...

కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టుల వల్ల పుష్కలంగా ఏర్పడిన నీటి లభ్యతను సంపూర్ణంగా వినియోగించుకోవాలని... ఎక్కువ ఆయకట్టుకు నీరందించాలని తెలిపారు. అన్ని ప్రాజెక్టుల పరిధిలో చివరి ఆయకట్టు వరకు నీరు ఇచ్చేందుకు వీలుగా కాల్వల సామర్థ్యం ఉందో లేదో మరోసారి పరిశీలించి అవసరమైతే నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచాలని సీఎం సూచించారు. ప్రణాళికా ప్రకారం నీటిని సరఫరా చేయడం వల్ల వానాకాలంలో లభించే నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకోవడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

30లక్షల ఎకరాల్లో..

రాష్ట్రంలో చెరువులు, చెక్ డ్యాములు ఎప్పుడూ నిండే ఉండాలని, ఫలితంగా భూగర్భ జలమట్టం పెరిగి రైతులు వేసుకున్న బోర్లకు నీరందుతుందని సీఎం చెప్పారు. ఫలితంగా కాల్వలు, చెరువులు, బోర్ల ద్వారా వ్యవసాయం సాగుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీ వరకు రెండు టీఎంసీల నీటిని తరలించే వెసులుబాటు కలిగినందున ఎస్సారెస్పీ పరిధిలో 30 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

పరిస్థితులకు అనుగుణంగా..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోనూ .. ఎప్పుడూ 25 నుంచి 30 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచి అవసరానికి, పరిస్థితులకు అనుగుణంగా వాడుకోవాలని సూచించారు. ఎల్లంపల్లి నుంచి అందే నీటి లభ్యతకు మించి ఆయకట్టును ప్రతిపాదించారని దాన్ని మార్చాలని సీఎం చెప్పారు. ఎల్లంపల్లి నుంచి 90వేల ఎకరాల లోపే ఆయకట్టుకు నీరందించడం సాధ్యమవుతుందని, మిగతా ఆయకట్టుకు ఎస్సారెస్పీ ద్వారా నీరందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కృష్ణా నుంచి లభ్యత..

ఈ ఏడాది కృష్ణా నదిలో కూడా ఎక్కువ నీటి లభ్యత ఉండే అవకాశం ఉందని సీఎం అన్నారు. ఇప్పటికే నారాయణపూర్ జలాశయం నుంచి నీరు వదిలినందున వెంటనే జూరాల, భీమా రెండో దశ ద్వారా నీటిని చెరువుల్లోకి తరలించాలని... రామన్‌పాడు జలాశయాన్ని నింపాలని ఆదేశించారు. కల్వకుర్తి లిఫ్టు ఎత్తిపోతల డీ-82 కాల్వ పనులను వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాదే 30 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో నీటిని పెద్ద మొత్తంలో నిల్వ చేసుకునేలా జలాశయాన్ని నిర్మించాలని లేదంటే చెరువుల సామర్థ్యం పెంచాలని చెప్పారు.

విభజన..

పని భారం పెరిగినందున సాగునీటి వ్యవస్థ సమర్థ నిర్వహణ కోసం నీటి పారుదల శాఖను పునర్విభజించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఎక్కువ జోన్లను ఏర్పాటు చేసి, ప్రతి జోన్‌కు ఒక చీఫ్ ఇంజనీర్‌ను బాధ్యుడిగా నియమించాలని అన్నారు. భారీ, మధ్య, చిన్నతరహా, ఐడీసీ విభాగాలుగా కాకుండా ఒకే విభాగంగా ప్రాజెక్టులు, కాల్వలు, జలాశయాలు, చెరువులన్నీ సంబంధిత సీఈ పరిధిలోనే ఉండాలని చెప్పారు. ప్రతి స్థాయి అధికారికి అత్యవసర పనుల కోసం నిధులు మంజూరు చేసే అధికారం కల్పించాలని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇవీ చూడండి:తెలంగాణలో కొత్తగా 1,269 మందికి కరోనా... మరో ఎనిమిది మంది మృతి

ABOUT THE AUTHOR

...view details