సాగునీటి రంగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా జలవనరులశాఖను రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్... శాఖకు కొత్త స్వరూపాన్ని ఖరారు చేశారు. ఇక నుంచి భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నీ ఒకే గొడుగు కింద పనిచేయన్నాయి. ఒక ప్రాంతంలోని అన్ని రకాల జలవనరులశాఖ వ్యవహారాలన్నీ ఒకే అధికారి పర్యవేక్షించేలా ప్రక్రియను పూర్తి చేశారు.
ప్రాదేశిక ప్రాంతాలుగా...
రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో చీఫ్ ఇంజనీర్‌ను పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాష్ట్రంలో ఇక నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్, రామగుండం, వరంగల్, ములుగు, సంగారెడ్డి, గజ్వేల్, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, హైదరాబాద్, కొత్తగూడెం, ఖమ్మం ప్రాదేశిక ప్రాంతాలు ఉంటాయి. ఆరుగురు ఇంజనీర్ ఇన్ చీఫ్‌లను నియమించి వారికి బాధ్యతలు పంచాలని నిర్ణయించారు.
ప్రత్యేక ఈఎన్సీలు...
సాధారణ, పరిపాలన, నిర్వహణ విభాగాలకు సైతం ఇక నుంచి ప్రత్యేకంగా ఈఎన్సీలు ఉంటారు. ప్రాదేశిక ప్రాంతాలకు ముగ్గురు సీనియర్ అధికారులకు ఈఎన్సీ హోదాలో బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు ఉండగా... అదనంగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను మంజూరు చేశారు. ఫలితంగా రాష్ట్రంలో ఈఎన్సీల సంఖ్య ఆరుకు చేరింది. చీఫ్ ఇంజినీర్ పోస్టులను 19 నుంచి 22కు, ఎస్ఈ పోస్టులను 47 నుంచి 57కు, ఈఈ పోస్టులను 206 నుంచి 234కు, డీఈఈ పోస్టులను 678 నుంచి 892కు, ఏఈఈ పోస్టులను 2వేల436 నుంచి 2,796కు పెంచారు.
పూర్తి చేయండి...
టెక్నికల్ ఆఫీసర్లు, నాన్ టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, రికార్డు అసిస్టెంట్ల సంఖ్య సైతం పెరిగింది. జలవనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరమవుతాయని అంచనా వేశారు. అత్యంత ప్రాధాన్యతాంశంగా రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టామన్న సీఎం కేసీఆర్... ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగా మిగిలిన కొద్దిపాటి లింకులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.