CM KCR on Drugs: మాదకద్రవ్యాల నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసినా, నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందినవారినైనా సరే వదలొద్దని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి తదితర మాదకద్రవ్యాల వినియోగాన్ని కూకటివేళ్లతో పెకలించాలనే లక్ష్యంతో ప్రగతిభవన్‌లో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ అధికారుల సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘మాదకద్రవ్యాల వాడకం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనం. దీన్ని తెలంగాణలో సమూలంగా నిర్మూలించడానికి పోలీసు అధికారులు బాధ్యతతో కృషి చేయాలి. దీన్నో సామాజిక ఉద్యమంలా మలిచినప్పుడే నియంత్రణ సాధ్యమవుతుంది. ప్రజలను చైతన్యపరచడం ఇందులో భాగం. వెయ్యిమంది సుశిక్షితులైన పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని, అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్‌ను తీర్చిదిద్దాలి. గ్రేహౌండ్స్ తరహాలో ఈ విభాగాన్ని బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
పంజాబ్‌లోని నిపుణులతో శిక్షణ
డ్రగ్స్ నియంత్రణలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అధునాతన ఆయుధాలను వినియోగించాలి. నిష్ణాతులైన మెరికల్లాంటి పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించాలి. స్కాట్లాండ్ యార్డ్ తరహాలో పోలీసు అధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలి. అవసరమైతే అలాంటి దేశాల్లో పర్యటించి రావాలి. పంజాబ్ లాంటి రాష్ట్రంలో మాదకద్రవ్యాల్ని నియంత్రిస్తున్న అధికారులను పిలిచి శిక్షణ తీసుకోవాలి. అందుకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుంది. అద్భుత పనితీరు కనబరిచే పోలీసు అధికారులకు అవార్డులు, రివార్డులు, యాగ్జిలరీ పదోన్నతులు తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తాం. అధికారులు మనసు పెట్టి పనిచేయాలి. నేరస్థులపై పీడీ చట్టం ప్రయోగించాలి. తెలంగాణ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్‌ను తిరిగి అమలులోకి తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి డీజీపీ ప్రణాళికలు సిద్ధంచేయాలి. పేకాట తదితర వ్యవస్థీకృత నేరాలను సమూలంగా రూపుమాపాలి. ఎక్సైజ్ శాఖలో అగ్గి కణికల్లాంటి అధికారులు కావాలని ముఖ్యమంత్రి అన్నారు.
యువత విముక్తికి కార్యాచరణ
‘మాదకద్రవ్యాల నియంత్రణకు ద్విముఖ వ్యూహం అనుసరించాలి. మత్తుకు బానిసలుగా మారిన వారిని గుర్తించడం మొదటి వ్యూహం. వారిని వ్యసనం నుంచి విముక్తులను చేయడానికి కుటుంబసభ్యుల సహకారంతో కార్యాచరణ రూపొందించాలి. మాదకద్రవ్యాలకు ఆకర్షితులవుతున్న యువతను గుర్తించి కట్టడి చేయాలి. రెండో వ్యూహంలో డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను, వ్యవస్థీకృత నేరవ్యవస్థల మూలాలను గుర్తించి నిర్మూలించాలి.’-సీఎం కేసీఆర్
అయిదుసార్లకి మించి గంజాయి దొరికితే అన్ని రకాల సబ్సిడీలూ రద్దు
అయిదు సార్లకు మించి గంజాయి దొరికితే ఆ ఊరికి ప్రభుత్వం అన్ని రకాల సబ్సిడీలను రద్దు చేస్తుంది. డ్రగ్స్ రహిత గ్రామాలకు ప్రత్యేక నిధులతో పాటు ప్రోత్సాహకాలు ఇస్తాం. గంజాయి సాగు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామస్థులమీద కూడా ఉంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా డ్రగ్స్ దందా నడుస్తుందనే విషయం పరిశీలనలో తేలింది. వాటిపై దృష్టిసారించాలి. కేసుల విచారణలో భాగంగా నిందితులను తీసుకొని కోర్టులకు వెళ్లిన పోలీసులు వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలి.
ఆధునిక సాంకేతికతతో ఫోరెన్సిక్ ల్యాబ్
కేసుల దర్యాప్తులో కీలకమైన ఫోరెన్సిక్ ల్యాబ్‌ను అత్యాధునిక సాంకేతికతతో ఏర్పాటు చేయాలి. న్యాయస్థానాల్లో నేరం రుజువు చేసేందుకు పక్కాగా చర్యలు తీసుకోవాలి. నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చి మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వ్యవస్థీకృత నేరస్థులను గుర్తించి వారి స్వదేశాలకు పంపించేయండి.