రాష్ట్రంలో గంజాయి సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని... మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్... పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు (cm kcr review on drugs mafia in telangana). ప్రగతిభవన్‌లో నిర్వహించిన పోలీస్, ఎక్సైజ్ శాఖ ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులనుద్దేశించి సీఎం ప్రసంగించారు (cm kcr review on drugs mafia in telangana). గంజాయి వినియోగం క్రమంగా పెరుగుతోందన్న నివేదికల నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకముందే పూర్తిగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్... గంజాయి ఉత్పత్తిని సమూలంగా నిర్మూలించేందుకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
వారికి రైతుబంధు, రైతు బీమా రద్దు
గంజాయి సాగుదారులకు రైతుబీమా, రైతుబంధు రద్దు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అటవీహక్కు పట్టాదారులు గంజాయి సాగుచేస్తే పట్టాల రద్దు పరిశీలిస్తామని వెల్లడించారు. డ్రగ్స్ దుష్ఫలితాలపై తీసే సినిమాలకు రాయితీ పరిశీలిస్తామని.. డ్రగ్స్ దుష్ఫలితాలపై పాఠాలు రూపొందించి సిలబస్‌లో చేర్చాలని సీఎం ఆదేశించారు. ఈ విషయమై త్వరలో మరోమారు భేటీ నిర్వహించి వ్యూహం రూపొందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో గుడుంబాపై నిరంతరం సమీక్షించి అరికట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. గుడుంబాపై ఆధారపడినవారికి ఉపాధి, పునరావాసం చూపాలని... వారి పునరావాసం కోసం నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు.
దాన్ని బట్టి పరిస్థితి అర్థం చేసుకోవాలి
సుదీర్ఘ పోరాట ఫలితంగా సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి దిశగా అనేక లక్ష్యాలను పూర్తి చేసుకున్నామని సీఎం తెలిపారు. అభివృద్ధిలో, సంక్షేమంలో దేశంలో నంబర్‌వన్‌గా పేరు తెచ్చుకున్నామని అన్నారు. రాష్ట్రంలో తీవ్రవాదాన్ని అరికట్టగలిగామన్న ఆయన... ఈ విజయం వెనుక పోలీస్‌శాఖ త్యాగాలు, వీరోచిత పోరాటం ఉందని అన్నారు. దీనివల్ల రాష్ట్ర గౌరవం, ప్రతిపత్తి ఎంతగానో పెరిగిందని వివరించారు. ఒక వైపు రాష్ట్రం గొప్ప అభివృద్ధిని సాధిస్తుంటే... గంజాయి వంటి మాదకద్రవ్యాల లభ్యత పెరగడం శోచనీయమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పీడను త్వరగా తొలగించకపోతే సాధిస్తున్న విజయాలు, వాటి ఫలితాలు నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉందని అన్నారు. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయన్న విషయాన్ని పోలీస్, ఎక్సైజ్ శాఖాధికారులు తీవ్రంగా పరిగణించాలన్న ముఖ్యమంత్రి... ఎంతో ఆవేదనతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెడతోవ పట్టిన యువత గంజాయి గ్రూపులుగా ఏర్పడి వాట్సాప్ ద్వారా మెసెజ్‌లు అందుకొని గంజాయి సేవిస్తున్నారన్న నివేదికలు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని సీఎం వ్యాఖ్యానించారు.
ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి
అమాయకులైన యువకులు తెలిసీ తెలియక వారి బారిన పడుతున్నారని... మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత మానసిక వ్యవస్థ దెబ్బతిని ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు (cm kcr review on drugs mafia in the state). గంజాయి, మాదకద్రవ్యాల నిరోధానికి ఏం కావాలన్నా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ అన్నారు. గంజాయి మాఫియాను అణిచివేయాలన్న ముఖ్యమంత్రి... నేరస్థులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. గంజాయిని నిరోధించేందుకు డైరెక్టర్ స్థాయి ప్రత్యేకాధికారి నేతృత్వంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ను, ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను బలోపేతం చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను సీఎం ఆదేశించారు.