కరోనాపై యుద్ధానికి సిద్ధంగా ఉన్నామన్న సీఎం.. 20 వేల పడకలతో లక్ష మంది రోగులకైనా చికిత్స అందించేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్డౌన్ అమలు, పేదలకు అందుతున్న సాయం, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
514 మంది చికిత్స పొందుతున్నారు
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ఏర్పాట్లు, అందుతున్న చికిత్స, భవిష్యత్ అవసరాల కోసం తీసుకుంటున్న చర్యలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సీఎంకు వివరించారు. కొత్తగా మరో ఆరు కేసులు నిర్ధారణ కావటంతో ప్రస్తుతం 514 మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో బుధవారం ఎనిమిది మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారన్న ఆయన... ఈరోజు మరో 128 మంది డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు.
ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్ జోన్లు
లాక్డౌన్కు ప్రజలు చాలా బాగా సహకరిస్తున్నారని... రానున్న రోజుల్లోనూ ఇదేతరహాలో సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈనెల 20 వరకు యథావిథిగా లాక్డౌన్ అమలవుతుందని.. ఆ తర్వాత పరిస్థితులను బట్టి మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందన్నారు. వైరస్ సోకిన వారి ఆధారంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 259 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి పకడ్బందీగా నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు.
రెండు లక్షల 25 వేల పీపీఈ కిట్లు
వైరస్ వ్యాప్తి జరగకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఎంతమందికైనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. వైద్యులు, సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులకు సంబంధించి కూడా ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు లక్షల 25 వేల పీపీఈ కిట్లు ఉండగా... కొద్ది రోజుల్లోనే ఈ సంఖ్య ఐదు లక్షలకు చేరుతుందని చెప్పారు. మరో ఐదు లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు చెప్పారు.