కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు... రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్, రాత్రిపూట కర్ఫ్యూ విజయవంతంగా అమలవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లోనూ అంతే పట్టుదలతో అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు... సామాజిక దూరాన్ని మించిన మార్గం లేదని పనురుద్ఘాటించారు. రాష్ట్రంలోని పరిస్థితిపై ప్రగతిభవన్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మతో సమీక్ష నిర్వహించారు. పోలీసు, వైద్యశాఖల సీనియర్ అధికారులతో... ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సీఎం అభినందనలు..
లాక్‌డౌన్, కర్ఫ్యూల విషయంలో ప్రజల సహకారం కీలకమని, ఎక్కడా వెసులుబాట్లకు అవకాశం ఉండదని... వ్యాధిని నిర్మూలించేందుకు... రాష్ట్రం మరింత పట్టుదల చూపాలని దిశానిర్దేశం చేశారు. ఎవరికి అనుమానం కలిగినా.. వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్న పోలీసు, వైద్యశాఖ సిబ్బంది, పారిశుద్ధ్య ఉద్యోగులను సీఎం అభినందించారు. విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెదిలిన వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని కనిపెడుతూ ఉండాలని అధికారులను కోరారు.
సామాజిక దూరం పాటించండి..