ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచాలన్నారు. పొరుగు సేవల ఉద్యోగులతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో అందరికీ 10 శాతం అదనపు వేతనం (కరోనా ఇన్సెంటివ్) ఈనెలా కొనసాగించాలని ఆదేశించారు. పోలీసు సిబ్బంది, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికీ ఇది వర్తిస్తుందని తెలిపారు. పీజీ పూర్తి చేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) ఖాళీగా ఉన్న 200 డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తాజా రిజ్వీ, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
కోలుకుంటున్న వారే ఎక్కువ
‘‘కరోనా కేవలం తెలంగాణలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉంది. అదేమీ ఇక్కడే పుట్టలేదు. జాతీయ సగటుతో చూసుకుంటే ఇక్కడ మరణాల రేటు తక్కువగానే ఉంది. రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో గురువారం నాటికి ఆసుపత్రుల్లో 3,692 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో తీవ్రమైన ఇతర జబ్బులున్న 200 మంది తప్ప మిగతావారంతా కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు 41,018 మందికి వైరస్ సోకింది. వారిలో 27,295 మంది (67 శాతం) కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. మిగతావారిలో ఎలాంటి లక్షణాలు లేని 9,636 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మిగతా వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. లక్షణాలు లేనప్పటికీ కొవిడ్ ప్రొటోకాల్ ప్రకారం వైరస్ సోకిన వారందరి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చికిత్స అందిస్తున్నాం. దేశంలో అన్ లాక్ ప్రక్రియ నడుస్తున్నది. ప్రజలు పనుల కోసం బయటకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలు కూడా నడపాలని నిర్ణయించింది. కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదే సమయంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దు.
-ముఖ్యమంత్రి కేసీఆర్
మొదట్లో కేంద్రమే గందరగోళ పడింది
కరోనా సోకినవారికి అవసరమైన ఔషధాలన్నింటినీ పెద్ద మొత్తంలో సిద్ధంగా పెట్టుకోవాలి. అవసరమైన వారికి ఉచితంగానే అందివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కొరత రానీయవద్దు. కొవిడ్ వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వమే మొదట గందరగోళంలో ఉండేది. కానీ తెలంగాణలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నాం. ఇప్పుడు వేటికీ కొరతలేదు. హైదరాబాద్‌లోని గాంధీ, టిమ్స్‌లోనే దాదాపు 3,000 బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5,000 పడకలను సిద్ధం చేశాం. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 10,000 పడకలను కేవలం కరోనా కోసమే కేటాయించి పెట్టాం. ఇన్ని బెడ్లు గతంలో ఎన్నడూ లేవు. 1500 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయి. మందులు, ఇతర పరికరాల కొరత లేదు. ప్రభుత్వ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ఎంతో గొప్పగా సేవలు అందిస్తున్నారు.
-ముఖ్యమంత్రి కేసీఆర్
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ కరోనా చికిత్స..