బడ్జెట్ సమావేశాల కసరత్తు వేగవంతమైంది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు.
బడ్జెట్‌పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
12:24 February 27
బడ్జెట్‌పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
ఆయా శాఖల నుంచి అందిన బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు, ఇప్పటి వరకు చేసిన వ్యయంతో రాబడులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు తదితర అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు చేయాల్సిన పథకాలు, తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.
బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల ఆరో తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. బడ్జెట్ సమావేశాల నిర్వహణ దిశగా అధికార యంత్రాంగం కూడా కసరత్తు వేగవంతం చేసింది. బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం సమావేశం కానున్నారు. బడ్జెట్ సమావేశాల సన్నద్ధతను సమీక్షించనున్న సీఎస్... ఆయా శాఖల నుంచి పంపాల్సిన సమాధానాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు.