రాష్ట్రంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కొత్తగా పారాబాయిల్డ్ మిల్లులను గణనీయంగా ఏర్పాటు చేయాలని అన్నారు. రెండో రోజు కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు. గతేడాది కాలంగా వ్యవసాయరంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, అధికారులు వివరించారు.
వ్యవసాయ ప్రగతిపై చర్చ
వానాకాలం సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. ఏడేళ్ల కాలంలో తెలంగాణ వ్యవసాయ ప్రస్థానం, సాధించిన ఘన విజయాలను... సీఎం కేసీఆర్ సమావేశంలో ప్రస్తావించారు. నాణ్యమైన ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములన్నింటినీ రైతులు సాగుచేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో సాగువిస్తీర్ణం పెద్దఎత్తున పెరిగిందన్న ముఖ్యమంత్రి... రైతుబంధు సహా సకాలంలో ఎరువులు, విత్తనాలు, తదితర రైతుసంక్షేమ కార్యక్రమాల ఫలితంగా నిరుడు రికార్డుస్థాయిలో మూడు కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని తెలిపారు. రైతులు మరింత ఉత్సాహంతో వరిధాన్యాన్ని పండించే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని తెలిపారు.
రికార్డు స్థాయిలో పండనున్నాయి
ప్రస్తుత వానాకాలంలో కోటి నలభై లక్షల ఎకరాల్లో సాగు జరగనుందని... వరి, పత్తి పంటలు రికార్డుస్థాయిలో పండనున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఇపుడున్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని చెప్పారు. రైస్ మిల్లుల్లో మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచాలని... కొత్త పారాబాయిల్డ్ మిల్లులను గణనీయంగా ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకోసం అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమలశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతులకు సమగ్రంగా శిక్షణ నిరంతరం కొనసాగాలని, అందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ శాఖకు స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని సూచించారు. అవసరమైన రీతిలో అధికారులు, నిపుణులను జోడించి నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.