రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం... సంబంధిత అంశాలపై చర్చించారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేనప్పటికీ రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్న ముఖ్యమంత్రి... అధికారులు రైతులందరికీ సకాలంలో సాయం అందించారని అన్నారు.
99.9 శాతం మంది రైతులకు సాయం
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 99.9 శాతం మంది రైతులకు సాయం అందిందని తెలిపారు. ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయినా, వెంటనే వారిని గుర్తించి రైతు బంధు అందించాలని ఆదేశించారు. సాయం అందరికి అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అన్న విషయాలను నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, జిల్లాల్లో మంత్రులు వెంటనే తెలుసుకుని, వారికి డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. యాజమాన్య హక్కుల విషయంలో చిన్నచిన్న సమస్యల వల్ల కొందరు రైతులకు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
లక్ష్మాపూర్‌కు అసలు రెవెన్యూ రికార్డే లేదు
మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్‌కు అసలు రెవెన్యూ రికార్డే లేదని, ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవతో మొత్తం గ్రామంలో సర్వే జరిపిన ప్రభుత్వం ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించిందని సీఎం తెలిపారు. రైతుబంధు సాయం ఎంత మందికి అందింది? ఇంకా ఎవరైనా మిగిలిరా? అన్న విషయాలపై క్లస్టర్ల వారీగా ఎంఈవోల నుంచి వెంటనే నివేదికలు తెప్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుబంధు సమితుల ద్వారా కూడా వివరాలు తెప్పించాలన్నారు.