భవిష్యత్ తెలంగాణలో వ్యవసాయ అద్భుత ముఖచిత్రానికి అవసరమైన విధాన రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. విత్తనం మొదలు మార్కెటింగ్ వరకు సమగ్ర వ్యూహం రూపొందించాలన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేలా పంట సాగు, కొనుగోలు విధానంలో మార్పులు తెచ్చేందుకు అధ్యయనం చేయాలని చెప్పారు. పండుతున్న పంటలు, రాష్ట్ర ప్రజల వినియోగం, అవసరాలకు తగ్గట్టుగా మార్గసూచి రూపొందించాలన్నారు. వ్యవసాయశాఖ, విశ్వవిద్యాలయం, నిపుణులు, రైతుబంధు సమితుల సహకారంతో ఈ కసరత్తు సాగాలన్నారు. వ్యవసాయ శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది.
ఖరీఫ్‌కు సిద్ధంకండి:
సాగునీటి వల్ల భూవిస్తీర్ణం భారీగా పెరుగుతోందని, అదనంగా ఏయే పంటలు పండించాలో యోచించాలని సీఎం సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తేవాలన్నారు. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసి ఏ ఒక్కరూ నష్టపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాబోయే ఖరీఫ్‌కు సర్వ సన్నద్ధం కావాలంటూ ఇందుకోసం ఎరువులు, విత్తనాలు సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.