వ్యవసాయ శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం స్వతంత్య్ర భారతదేశంలో గతంలో ఎన్నడూ, ఎక్కడా జరగనంత ప్రయత్నం తెలంగాణలో జరుగుతోందని సీఎం అన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించి.. రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తున్నామన్న ఆయన... నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు ద్వారా పెట్టుబడిసాయం అందిస్తున్నామని వివరించారు. ఐదు లక్షల రూపాయల రైతుబీమా కల్పించటంతోపాటు కరోనా కష్ట కాలంలోనూ రైతులు పండించిన పంటను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసిందని చెప్పారు.
రైతు వేదికల నిర్మాణం మూడు నెలల్లో పూర్తి
రైతులను సంఘటిత పరిచేందుకు ప్రభుత్వమే రైతుబంధు సమితులు ఏర్పాటు చేసిందన్న కేసీఆర్... క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదికల నిర్మాణం మూడు నెలల్లో పూర్తి అవుతుందని తెలిపారు. రైతు వేదికలు రైతుల చైతన్యానికి వేదికలుగా మారుతాయని.. ముఖ్యమంత్రితోపాటు ఎవరైనా సరే నేరుగా రైతులతో మాట్లాడే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారాలని... అంతిమంగా రైతులు ధనికులుగా మారాలని స్పష్టం చేశారు. అందుకోసమే ఎంతో వ్యయంతో ప్రభుత్వం చేస్తోన్న అనేక ప్రయత్నాలు ఫలించాలంటే వ్యవసాయ శాఖ మరింత క్రియాశీలంగా వ్యవహరించాలన్నారు.
సంస్థాగతంగా బలోపేతం కావాలి
గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ మారుతోందని... అందుకు తగ్గట్లు వ్యవసాయ శాఖ కూడా సంస్థాగతంగా బలోపేతం కావాలని సీఎం ఆకాంక్షించారు. అవసరమైతే వ్యవసాయ శాఖకు మరిన్ని పోస్టులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సంప్రదాయక వ్యవసాయ పద్ధతుల స్థానంలో ఆధునిక విధానాలు రావాలన్న కేసీఆర్... ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులను అధ్యయనం చేసి... వాటిని తెలంగాణలో అమలు చేయాలని చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక సాగు పద్ధతులు రావాలని, యాంత్రీకరణ పెరగాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన సింగిల్ పిక్ క్రాప్స్ను అధ్యయనం చేయాలని చెప్పారు. తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా పండే పంటలు, వాటి సాగు పద్ధతులు తెలుసుకోవాలన్నారు. అధికారులు, రైతులు తరచూ విజ్ఞాన యాత్రలు చేయాలన్న సీఎం... రాష్ట్రం, దేశం, ఇతర దేశాల్లో మెరుగైన సాగు పద్ధతులను అధ్యయనం చేయాలని చెప్పారు.