తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Review : వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు.. అర్హత ప్రకారం వారికి వివిధ శాఖల్లో సర్దుబాటు - kcr decides to abolish vra system entirely

CM KCR
CM KCR

By

Published : Jul 23, 2023, 4:30 PM IST

Updated : Jul 23, 2023, 10:43 PM IST

15:41 July 23

CM KCR Review on VRAs Adjustment : వీఆర్ఏల సర్దుబాటుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR Review on VRAs Adjustment in Telangana : నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలువబడుతూ, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ సిఫారసుల మేరకు, నిబంధనలను అనుసరించి వీఆర్ఏల అర్హతల ప్రకారం, మున్సిపాలిటీ, మిషన్‌భగీరథ, ఇరిగేషన్ తదితర శాఖల్లో సర్దుబాటు చేస్తూ.. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సోమవారం విడుదల చేయాలని సీఎస్‌ శాంతి కుమారిని.. కేసీఆర్ ఆదేశించారు.

వ్యవసాయం అభివృద్ధి చెంది సాగునీటి విధానం అమల్లోకి వచ్చిన నాటి కాలంలో.. ప్రతి గ్రామంలో నీటి వ్యవస్థను సక్రమంగా నిర్వహించడంతో పాటు.. గ్రామ రెవెన్యూ తదితర అవసరాలకోసం ఏర్పాటయిన గ్రామ సహాయకుల వ్యవస్థ.. నేటి వీఆర్ఏలుగా రూపాంతరం చెందిందని కేసీఆర్ అన్నారు. ఆవిధంగా తరతరాలుగా సామాజిక సేవ చేస్తున్న వీఆర్ఏల త్యాగపూరిత సేవ గొప్పదని కొనియాడారు. కాగా నేటి మారిన పరిస్థితుల్లో వారి వృత్తికి ప్రాధాన్యం తగ్గిన నేపథ్యంలో, వారిని రెవెన్యూశాఖలో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించి.. పర్మినెంట్ చేసి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటామని సీఎం స్పష్టంచేశారు.

KCR on VRA System : రాష్ట్రంలో వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ తదితర అంశాలపై.. నూతన సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సామాజిక పరిణామ క్రమంలో మార్పులకనుగుణంగా, ప్రజల అవసరాలను అనుసరించి.. పాలకులు నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. కాలానుగుణంగా కనుమరుగవుతున్న వృత్తుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు.. ప్రత్యామ్నాయంగా ఉద్యోగ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. ఇదే తెలంగాణ సర్కార్‌ విధానమని.. దీనిని అనుసరించే వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు.

Good News to VRAs : రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. వీరిలో నిరక్షరాస్యులు, ఏడోతరగతి పాసైనవారు, పదోతరగతి పాసైనవారు,.. ఇంటర్మీడియేట్ వరకు మాత్రమే చదివి పాసైనవారు, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు చదివినవారు ఉన్నారని చెప్పారు. వీరి విద్యార్హతను ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగ కేటగిరీలను నిర్ధారిస్తుందని వెల్లడించారు. నిబంధనలకు అనుగుణంగా ఆయా శాఖల్లో వారి భర్తీ చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివి ప్రమోషన్లకు అర్హులైన వారికి అందుకనుగుణమైన పోస్టుల్లో భర్తీ చేయనున్నట్టు కేసీఆర్ వివరించారు.

ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టి, విధివిధానాలు ఖరారు చేసి.. రేపు ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌ను.. కేసీఆర్ ఆదేశించారు. 61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అదేవిధంగా... 2 జూన్ 2014 అనంతరం 61 సంవత్సరాలలోపు ఉండి.. ఏ కారణం చేతనైనా వీఆర్ఏ విధులు నిర్వహిస్తూ మరణించిన.. వారి వారసులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామనిసీఎం పేర్కొన్నారు.

CM KCR Review on VRAs Adjustment:ఈ మేరకు చనిపోయిన వీఆర్ఏల వారసుల వివరాలు, వారి విద్యార్హతలు త్వరలో సేకరించాలని అధికారులను, వీఆర్ఏ జేఏసీ నేతలకు.. కేసీఆర్ సూచించారు. వారికి కూడా నిబంధనలకు అనుసరించి అర్హతల మేరకు, ఆయా శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తరతరాలుగా సమాజానికి సేవ చేస్తున్న వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం వారి వ్యక్తిగతంగా మాత్రమే కాదని.. ఇది సమాజానికి చేస్తున్న సేవగా భావిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.

Telangana Government Canceled VRA System : అట్టడుగు స్థాయి నుంచి త్యాగాలతో, శ్రమతో సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారి కోసం.. తమ ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఎవరూ అడగకుండానే సమాజానికి సేవలు చేస్తున్న ఉద్యోగ వర్గాలకు జీతాలు పెంచి వారి సంక్షేమానికి పాటుపడిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. సఫాయన్నా..నీకు సలామన్నా అంటూ డిగ్నిటీ ఆఫ్ లేబర్‌కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని కేసీఆర్ స్పష్టం చేశారు.

PRC for Contract and Outsourcing Employees in HMWSSB : మరోవైపు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజి బోర్డు ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీలో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఉద్యోగులకు 30 శాతం పీఆర్‌సీ అమలు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా సుమారు నాలుగు వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. తమకు పీఆర్‌సీ అమలు చేసిన కేసీఆర్‌కు.. మెట్రోవాటర్‌ వర్కర్స్‌ యూనియన్‌ నేతలు ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చదవండి :VRAs Arrangements : రెవెన్యూశాఖలోనే కొనసాగించాలి.. మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరిన వీఆర్‌ఏ ఐకాస

వీఆర్‌ఏలతో మంత్రి కేటీఆర్‌ కీలక చర్చలు.. ఈసారైనా ఫలించేనా..!!:

Last Updated : Jul 23, 2023, 10:43 PM IST

ABOUT THE AUTHOR

...view details