రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతోన్న తెలంగాణ దళిత బంధు పథకం అమలు విధివిధానాలు, రూపొందించాల్సిన ఉపాధి పథకాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ డెవలప్ కార్పొరేషన్ ఎండీ పి.కరుణాకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగాదళితులకు ఎలాంటి పరిశ్రమలను పెట్టిస్తే.. లేదా ఎంతటి పనిని అప్పజెబితే.. సులువుగా చేసుకోగలరో గుర్తించడంతో పాటు.. దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన వెంటనే ఉపాధి లభ్యత ఎలా ఉంటుందనే అంశాలను అధికారులు ముందుగా గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు. దళిత బంధు కార్యాచరణపై త్వరలోనే ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ప్రముఖులు, ఆయా సంఘాల నేతలతో కార్యశాల నిర్వహిస్తామన్నారు. ముందుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అక్కడి అనుభవాల ఆధారంగా రాష్ట్రంలో 33 జిల్లాలకు చెందిన అధికారులను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. ముందుగా గ్రామాల్లో పర్యటించి.. దళిత కుటుంబాల స్థితిగతులను అర్థం చేసుకోవాలని.. వారి అవసరాలేంటో తెలుసుకుని వారి అభిప్రాయాలను సేకరించాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
అవగాహన కల్పించాలి..
మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా.. దళితులకు అనువైన రీతిలో త్వరితగతిన ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించే పలు రకాల పనులను గుర్తించి వాటిని పథకాలుగా మలచాలని ముఖ్యమంత్రి వెల్లడించారు. వినూత్న పథకాల రూపకల్పన కోసం ఉన్నతాధికారులు దళితులతో మాట్లాడాలని.. వారి అభ్యున్నతి కోసం పని చేస్తున్న అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలన్నారు. ఒక కుటుంబంలో ఇంటి పెద్దగా మహిళ ఉంటే.. వారికి ఏ విధానం ద్వారా ఉపాధి లభిస్తుందో లోతుగా అధ్యయనం చేయాలన్నారు. ప్రస్తుతం అమలవుతున్న వివిధ రకాల ఉపాధి పథకాలపై వారికి అవగాహన కల్పించాలని.. ఇప్పటికే ఆ ప్రాంతంలో లేదా ఆ గ్రామంలో అమలు పరుస్తున్న ఇతర ఉపాధి మార్గాలేమున్నాయో పరిశీలించాలని పేర్కొన్నారు. వాటన్నింటిలోనూ.. లబ్ధిదారులు కోరుకున్న స్కీమ్‌నే ఖాయం చేయాలని సీఎం స్పష్టం చేశారు.