కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు విశేష కృషి చేస్తున్న వైద్య ఆరోగ్య, పోలీసు ఉద్యోగులకు మార్చి నెల పూర్తి వేతనం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం కూడా అందించాలని స్పష్టం చేశారు. ప్రోత్సహకాన్ని ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
మరో 300 మందికి వైద్య పరీక్షలు..
నిన్న ఒక్కరోజే జరిపిన పరీక్షల్లో 30 మందికి వైరస్ సోకినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు మరింత వేగవంతమైన కార్యాచరణ చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు. దిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొంతమందికి ప్రభుత్వం.. పరీక్షలు నిర్వహిస్తుంది. మరో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఆచూకీ తెలియని 160 మంది గురించినట్లు అధికారులను సీఎం కేసీఆర్ అడిగినట్లు సమాచారం. మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న వారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని సీఎం కోరారు. వైరస్ సోకినట్లు తేలినా వారి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు.