తెలంగాణ

telangana

ETV Bharat / state

మే7 దాకా ఇంతే.. కేసులు తగ్గటం శుభపరిణామం : కేసీఆర్

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండటం శుభపరిణామం : సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతుండటం శుభపరిణామం : సీఎం కేసీఆర్

By

Published : Apr 27, 2020, 8:33 PM IST

Updated : Apr 27, 2020, 9:51 PM IST

20:23 April 27

మే7 దాకా ఇంతే.. కేసులు తగ్గటం శుభపరిణామం : కేసీఆర్

కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితులు, లాక్‌ డౌన్ అమలు తీరు, భవిష్యత్ కార్యాచరణపై ఉన్నతాధికారులతో  సీఎం చర్చించారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోందని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నేడు 159 మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని సీఎం ప్రకటించారు. అందులో 16 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు తెలిపారు. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా వ్యాప్తి తగ్గుతుండటం శుభసూచకమన్నారు. కొద్ది రోజుల్లోనే కరోనా కేసులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28 నాటికి 21 జిల్లాలు కరోనా రహిత జిల్లాలుగా మారనున్నట్లు వెల్లడించారు. కరోనా  సోకిన  వారిలో 97 శాతానికిపైగా బాధితులు కోలుకున్నారని సీఎం వివరించారు.

కంటైన్మెంట్ల జోన్లు తగ్గుముఖం...

వైరస్ వ్యాప్తి తగ్గుతున్నందున కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మర్కజ్ వెళ్లొచ్చిన వారి ద్వారా వైరస్ సోకుతున్న వారి లింక్ మొత్తం గుర్తించామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ పరీక్షలు నిర్వహించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కరోనా గురించి ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  సీఎం తేల్చి చెప్పారు. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టినంత మాత్రాన ఉదాసీనంగా ఉండొద్దని ఆయన సూచించారు. ప్రతీక్షణం అప్రమత్తంగానే ఉంటామన్నారు. మళ్లీ ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చినా సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. టెస్టింగ్, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, ఔషధాలు సిద్ధంగా ఉన్నాయని  సీఎం వెల్లడించారు. 

మే 7వరకు లాక్ డౌన్ తప్పనిసరి...

రాష్ట్రంలో మే 7 వరకు లాక్‌ డౌన్ కొనసాగుతుందన్నారు. ప్రజలు కూడా లాక్‌ డౌన్ నిబంధనలు పాటిస్తూ సహకరించాలని సీఎం సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన కోరారు. అన్ని మతాల వారు ఇళ్లలోనే ప్రార్థనలు, పండుగలు జరుపుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచనలు అందించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మాజీ స్పీకర్ మధుసూదనా చారి తదితరులు పాల్గొన్నారు.

 ఇవీ చూడండి : క్యాన్సర్​తో పాటు కరోనాను జయించిన నాలుగేళ్ల శివాని

Last Updated : Apr 27, 2020, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details