హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. ఆరు వరుసలకు విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ అందజేశారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా దండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందిగామ వరకు 181.5 కిలోమీటర్ల మార్గాన్ని జీఎమ్మార్ హైదరాబాద్-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వేస్ సంస్థ సుమారు రూ.1,740 కోట్ల వ్యయంతో 2012లో నాలుగు వరుసల మార్గాన్ని పూర్తి చేసింది. 2024 నాటికి ఆ మార్గాన్ని ఆరు వరుసలకు విస్తరించాలి. అవసరమైన భూ సేకరణ కూడా అప్పుడే పూర్తి చేశారు.
ఆ మొక్కలను ఏమి చేస్తారు..?
ఈ రహదారిలో హరితహారం పేరుతో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. విస్తరణ చేపడితే వాటన్నింటినీ ఏమి చేస్తారన్నది ప్రశ్న. ఆర్థిక వ్యవహారాలు, భవిష్యత్తు విస్తరణ వ్యవహారాల్లో గుత్తేదారు సంస్థ, జాతీయ రహదారుల సంస్థల మధ్య వివాదం చోటు చేసుకుంది. అది తేలితే పనులు ప్రస్తుత గుత్తేదారుకు అప్పగిస్తారా? మరో సంస్థకు ఇస్తారా అన్నది ఖరారు అవుతుంది. పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుత్తేదారు సంస్థ ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా రాసింది.
వ్యయం రూ. మూడున్నర వేల కోట్ల పైమాటే
ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు విస్తరించేందుకు భారీగా వ్యయం అవుతుందన్నది అధికారుల అంచనా. రహదారి విస్తరణతోపాటు సర్వీసు మార్గాలు, జాతీయ రహదారిపైకి ఇతర వాహనాలు రాకుండా కట్టడి, పలు ప్రాంతాల్లో అండర్ పాస్‌ల నిర్మాణం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. ఇందు కోసం సుమారు మూడున్నర వేల కోట్ల నుంచి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందన్నది అంచనా.
ట్రాఫిక్ పెరిగింది...
నాలుగు వరుసల పనులు 2010లో ప్రారంభం అయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర హయాంలో చేపట్టారు. ఆ సమయంలో ఆంధ్రా ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు గణనీయంగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కొంత తగ్గినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాయి. ప్రస్తుతం రోజువారీగా 40 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారుల అంచనా. ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో రహదారిని ఆరు వరుసలకు విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ఆ వివాదాన్ని కేంద్రం ఎప్పుడు పరిష్కరిస్తుంది? విస్తరణ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిత్యం రద్ధీగా ఉండే ఈ రహదారి విస్తరణతో సరుకులు, ప్రజారవాణా సామర్థ్యాన్ని.. మరింత వినియోగించుకోవడం సాధ్యమవుతుంది.
ఇదీ చూడండి:NH Expansion: ఎల్బీనగర్ - మల్కాపూర్ జాతీయ రహదారి విస్తరణకు పచ్చ జెండా