రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్‌డెసివర్, ఔషధాల లభ్యతపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూలంకషంగా సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఫోన్లో మాట్లాడిన సీఎం... రాష్ట్రానికి కావాల్సిన టీకాలు, ఆక్సిజన్, రెమ్‌డెసివర్ తక్షణమే సమకూర్చాలని అభ్యర్థించారు. తమిళనాడులోని శ్రీపెరంబదూరు, కర్ణాటకలోని బళ్లారి నుంచి కేటాయించిన ఆక్సిజన్ అందడంలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. మెడికల్ హబ్‌గా మారిన హైదరాబాద్ పైనే వైద్య సేవల కోసం పొరుగు రాష్ట్రాల ప్రజలు ఆధారపడటం వల్ల.. రాష్ట్రంపై భారం పెరిగిపోయిందని సీఎం వివరించారు.
500 మెట్రిక్ టన్నులకు పెంచాలి
ప్రస్తుతం రోజుకు అందుతున్న 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను 500 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. రాష్ట్రానికి రోజుకు కేవలం 4వేల 900 రెమ్‌డెసివర్లు మాత్రమే అందుతున్నాయని... వాటిని కనీసం 25వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఇప్పటి వరకు 50 లక్షల టీకాల డోసులు అందించిందని... రాష్ట్ర అవసరాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రానికి ప్రతిరోజు రెండు నుంచి రెండున్నర లక్షల డోసులు సరఫరా చేయాలని మోదీని కోరారు. ప్రధాని ఆదేశాల మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆక్సిజన్‌ను కర్ణాటక, తమిళనాడు నుంచి కాకుండా తూర్పు రాష్ట్రాల నుంచి సరఫరా జరిగేలా చూస్తామని తెలిపారు.
చైనా నుంచి 12 క్రయోజనిక్ ట్యాంకర్లు
అనంతరం రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. రెమ్‌డెసివర్ తయారీ సంస్థలతో ఫోన్లో మాట్లాడిన ముఖ్యమంత్రి వాటి లభ్యతను మరింతగా పెంచాలని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 9వేల 500 ఆక్సిజన్ వసతి కలిగిన పడకలు ఉన్నాయని... వారం రోజుల్లో మరో 5వేలు పెంచాలని అధికారులను ఆదేశించారు. కోటి రూపాయల చొప్పున వ్యయం చేసే 12 క్రయోజనిక్ ట్యాంకర్లను చైనా నుంచి వాయుమార్గంలో అత్యవసరంగా దిగుమతి చేయాలని చెప్పారు. ఐఐసీటీ డైరక్టర్ చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడిన సీఎం... ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చంద్రశేఖర్ సూచనల మేరకు తక్షణమే 500 ఆక్సిజన్ ఎన్‌రిచర్‌లను కొనుగోలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, ఔషధాల కొరత రావొద్దని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.