కరోనా కట్టడి, లాక్‌డౌన్ కొనసాగింపు తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించినవీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కరోనా నియంత్రణకు సంబంధించి వివిధ అంశాలపై ప్రధాని సీఎంతో చర్చించారు. సీఎం అభిప్రాయాలు తెలుసుకున్నారు. కేసీఆర్ పలు సూచనలు చేశారు.
కరోనా కట్టడికి లాక్‌డౌన్ బాగా ఉపయోగపడిందని, మరో రెండువారాలు పొడిగించాలని ప్రధాని మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఇంతకు మించిన మార్గం లేదని సీఎం అభిప్రాయ పడ్డారు. రైతులు నష్టపోకుండా, నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిచేలా చూడాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారు. దేశం ఏకతాటిపై నిలబడి కరోనా వైరస్‌పై పోరాడుతోందని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తి కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాపై పోరాటానికి రాష్ట్రాలకు కేంద్రం నుంచి కావాల్సిన మద్దతు లభిస్తోందని చెప్పారు. మోదీ అండగా నిలవడం తమకెంతో మనోధైర్యం ఇస్తోందని కేసీఆర్ తెలిపారు.
కరోనాపై యుద్ధంలో భారత్ తప్పక గెలిచి తీరుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 135 కోట్ల జనాభాకు తిండి పెట్టడం మరే దేశానికి సాధ్యం కాదన్నారు. ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధితో ఉన్నామని తెలిపారు. అన్నం పెట్టే రైతులకు అండగా నిలవాలని మోదీని కోరారు.
.
లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగించండి.. ప్రధానితో కేసీఆర్