TRS MLAs Poaching Videos: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో అరెస్టయిన నిందితులు.. వారితో జరిపిన సంభాషణలకు సంబంధించిన దృశ్యాలను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. ఈ కేసు కీలక నిందితుడు రామచంద్రభారతి.. మిగతా ఇద్దరు నందకుమార్, సింహయాజీతో కలిసి అనేక విషయాలను నలుగురు ఎమ్మెల్యేలకు వివరించారు. భాజపాలో ముగ్గురు కీలక నేతలు బీఎల్ సంతోశ్, అమిత్‌షా, జేపీ నడ్డా అన్ని విషయాలు చూసుకుంటారని చెప్పారు. దిల్లీలో అమిత్‌షా, బీఎల్ సంతోశ్, జేపీ నడ్డాలను కలిసి మీతో మాట్లాడిందంతా వారికి సందేశం పంపామని తెలిపారు. అమిత్‌షాతో చెప్పాక.. దిల్లీలో మీరు కలిసే తేదీని ఖరారు చేస్తామన్నారు. మునుగోడు ఎన్నిక కంటే ముందే ఈ ఆపరేషన్ పూర్తి కావాలని, ఒకసారి అంగీకరించాక మీ బాధ్యత మాదేనని పేర్కొన్నారు.
రామచంద్రభారతి: అందరికీ రూ.50 వస్తాయి.. అంటే రూ.50 కోట్లు.
రామచంద్రభారతి: పార్టీలో రాజకీయాల వరకు అమిత్‌షా, బీఎల్ సంతోశ్, తుషార్ చూసుకుంటారు. మొదట బీఎల్ సంతోశ్ అన్ని అంశాలను చూసుకుంటారు. ఆయన సహచరుడు తుషార్. వీరిద్దరు ఒప్పుకొంటే విషయం అమిత్‌షా, జేపీ నడ్డా వరకు వెళ్తుంది. వారిద్దరు ఒకేసారి నిర్ణయాలు తీసుకుంటారు. నాకు మీ గురించిన సమాచారం వచ్చిన వెంటనే ఈ సమాచారాన్ని సంతోశ్, తుషార్, అమిత్‌షాకు పంపాను. మేం ఇక్కడి నుంచి వెళ్లే ముందే అన్ని విషయాలను క్లియర్ చేస్తాం. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మీ ఎమ్మెల్యేలందరికీ బీ ఫారాలు పక్కా. రాజకీయ జీవితంలో నగదు సహకారం సహా మీకు కావాల్సినవన్నీ వస్తాయి. మీరంతా రోహిత్‌తో టచ్‌లో ఉండాలి.
తెలంగాణలో జాతీయ స్థాయి నాయకులు ఎవరూ లేరన్న రామచంద్రభారతి.. దేశంలోని 17 ప్రతిపక్ష పార్టీలు ఎన్నటికీ ఒకేచోటికి వచ్చి కూటమిగా ఏర్పాటు కాలేవన్నారు. కాంగ్రెస్‌లో నాయకత్వం లేదన్న ఆయన.. దేశంలో మరో 15 ఏళ్ల పాటు దేశనాయకత్వం భాజపాదేనని తెరాస ఎమ్మెల్యేలతో చెప్పారు.
రామచంద్రభారతి: వచ్చే 15 ఏళ్ల పాటు భాజపా జాతీయస్థాయి నాయకత్వంలో ఉంటుంది. ఇది పక్కా. కాంగ్రెస్‌లో నాయకత్వం లేదు. తెలంగాణలో జాతీయ నాయకులెవరూ లేరు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయినప్పటికీ.. దేశవ్యాప్తంగా నిర్మాణ దశలోనే ఉంది. దేశంలోని 17 పార్టీలు కలిసి ఒక ప్రతిపక్ష కూటమిగా ఏర్పాటు కావడం సాధ్యం కాదు. అక్కడ అందరూ పీఎం అభ్యర్థులు. వారెవరూ ఎప్పటికీ ఒకచోటికి రారు. అందుకే 15 ఏళ్ల పాటు భాజపా అధికారానికి ఢోకా లేదు.
ఈవీఎంలు ఉన్నంతకాలం భాజపాకు ఢోకా లేదని నిందితులు వ్యాఖ్యానించారు.
రామచంద్రభారతి: ఈవీఎం మిషన్లను ఆపరేట్ చేయం. వాటితో ఆపరేషన్లు చేస్తుంటాం.