Ramadan 2023 Celebrations In Hyderabad: రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఈద్- ఉల్ - ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనలు సమాజాన్ని తీర్చిదిద్దాయని పేర్కొన్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ, దైవభక్తి పరిఢవిల్లుతోందని అన్నారు. ముస్లిం సోదరులు ఆధ్యాత్మిక చింతన స్ఫూర్తితో.. ఈద్- ఉల్ - ఫితర్ జరుపుకోవాలని సూచించారు.
KCR Wishes on Ramadan : అల్లా దీవెనలతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. గంగా జమునా సంస్కృతికి తెలంగాణ నేల ఆలవాలం అని వ్యాఖ్యానించారు. లౌకికవాదం, మత సామరస్యం పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
భద్రతా వలయంలో ప్రార్థనా మందిరాలు: ఇవాళ రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు నిర్వహించే ప్రత్యేక సామూహిక ప్రార్ధనలకు భాగ్యనగరం సర్వం సిద్దమైంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జంటనగరాల్లోని ముస్లిం సోదరులు పలు మసీదుల్లో, ఈద్గాల వద్ద భారీ సంఖ్యలో ప్రార్ధనలు నిర్వహిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలో జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీ, మిరాలం ఈద్గా, చార్మినార్, మాసబ్‌ట్యాంక్ హాకీ మైదానం, సికింద్రాబాద్, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రార్ధనలు జరిగే సమయం ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.