Telangana budget sessions 2023-24 : శాసనసభలో బీఏసీ సమావేశ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యులకు వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 8వ తేదీన బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుందని.. వాటికి ప్రభుత్వం సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. 9, 10, 11 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ.. 12న ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరగనున్నట్లు కేసీఆర్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. ఇంకా ఏమైనా అంశాలు మిగిలి ఉంటే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం: అంతకు ముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ జరుగుతోంది. రెండు సభల్లోనూ ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేసి నేరుగా చర్చలోకి వెళ్లారు. ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో శాసనసభ్యుడు వివేకానంద గౌడ్ బలపరిచారు. మండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బలపరిచారు. ఆ తర్వాత అన్ని పక్షాల నేతలు చర్చల్లో పాల్గొన్నారు.
గవర్నర్ ప్రసంగంపై అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం: మరోవైపు తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగంపై ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అంశాలు ప్రస్తావించలేదని.. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాలు పేర్కొనలేదా.. లేక గవర్నర్ తొలగించారా అని ప్రశ్నించారు. ప్రొరోగ్ చేయకుండానే సమావేశాల నోటిఫికేషన్ ఇచ్చారని.. అసలు గవర్నర్ ప్రసంగాన్ని మంత్రివర్గం ఆమోదించిందా అని అడిగారు. ఆమోదిస్తే కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కేబినెట్ కూడా చర్చించలేదా? అని అక్బరుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.